* వేడుకలకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు
* అధికార, ప్రతిపక్ష సభ్యులు అందరికీ ఆహ్వానాలు
* ఉద్యమకారులు, కవులు, కళాకారులకు సత్కారాలు
* రాష్ట్ర స్థాయిలో పరేడ్ గ్రౌండ్లో కార్యక్రమం
* జూన్ 2 రాత్రి 7గంటలకు ట్యాంక్‌బండ్‌పై వేడుకలు
* ఉదయం రాష్ట్ర గీతం.. జాతికి అంకితం
* జిల్లాల్లో కలెక్టర్ల నేతృత్వంలో జాతీయ జెండా ఆవిష్కరణలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ ప్రతినిధి : కళాతోరణాలు.. ఆధ్యాత్మిక సౌరభాలు.. సాంస్కృతిక కార్యక్రమాలు.. లేజర్ షో వెలుగుల్లో జూన్ 2 తెలంగాణ ఆవిర్భావం అంగరంగ వైభవంగా అదిరిపోయేలా ఏర్పాట్లు చేస్తోంది తెలంగాణ సర్కారు. పరేడ్ గ్రౌండ్, ట్యాంక్‌బండ్ ప్రాంతాల్లో వేడుకలకు భారీ కసరత్తు చేస్తోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి స్వయంగా పనులను పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో పరేడ్ గ్రౌండ్లో నిర్వహించనున్న కార్యక్రమానికి హాజరు కావాలని అమరుల కుటుంబ సభ్యులకు, ఉద్యమకారులకు ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లు ఆహ్వానాలు పంపారు. ప్రతిపక్ష నేత కేసీఆర్‌కు, ఇతర పార్టీల నేతలకు కూడా సర్కారు ఆహ్వానాలు పంపింది. విద్యావేత్త చుక్కా రామయ్యను పరామర్శించిన రేవంత్ రెడ్డి వేడుకలకు హాజరు కావాలని స్వయంగా ఆహ్వానించారు.
ప్రత్యేక లాంజ్‌లు
వేడుకల కోసం పరేడ్ గ్రౌండ్ లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాన వేదిక తో పాటు, ముఖ్య అతిథులకు, ఆహ్వనితులకు, అధికారులకు, ప్రజా ప్రతినిధులకు వేరు వేరుగా లాంజ్ లు ఏర్పాటు చేస్తున్నారు. వేసవి ఎండల తీవ్రత నేపథ్యంలో కార్యక్రమానికి విచ్చేసే వారందరికి అసౌకర్యం కలగకుండా భారీ టెంట్ లను ఏర్పాటు చేస్తున్నారు. సభా ప్రాంగణంలో ప్రత్యేక మెడికల్ క్యాంపులు, తాగునీటి వసతులు, మొబైల్ టాయిలెట్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో ఎల్.ఈ.డీ స్క్రీన్ లు, కార్యక్రమ లైవ్ ప్రసారానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
ట్యాంక్ బండ్‌పై సాంస్కృతిక కార్యక్రమాలు
జూన్ 2 వ తేదీన సాయంత్రం ట్యాంక్ బండ్ పై సాంస్కృతిక కార్యక్రమాలు అలరించనున్నాయి. కార్నివాల్, లేజర్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. భారీ ఎత్తున బాణసంచా కాల్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వివిధ జిల్లాలకు చెందిన సాంస్కృతిక కళా బృందాలతో ప్రదర్శనలు ఉండనున్నాయి. సందర్శకులు, చిన్నారుల కోసం ఫుడ్, గేమింగ్ స్టాళ్ళను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసే పలు సాంస్కృతిక కార్యక్రమాలకు ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర ప్రముఖులు హాజరవుతారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన పలు సాంస్కృతిక కళా బృందాలచే కార్నివాల్ ప్రదర్శనలు ఉండనున్నాయి. ప్రధాన స్టేజీ పై పలు శాస్త్రీయ, జానపద, దక్కనీ సాంస్కృతిక కార్యక్రమాలు, తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతం ‘జయ జయహే తెలంగాణ’ పై జాతీయ జెండాలతో మార్చ్-ఫాస్ట్ నిర్వహించనున్నారు.
రేపటి నుంచే అందుబాటులోకి..
ట్యాంక్ బండ్ పై దాదాపు 80 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ స్టాళ్లలో రాష్ట్రంలోని హస్త కళలలు, స్వయం సహాయక బృందాలు తయారు చేసిన ఉత్పత్తులు, చేనేత వస్త్రాలు, నగరం లోని పలు ప్రముఖ హోటళ్ళచే స్టాళ్ళ ఏర్పాటు, చిన్న పిల్లలకు గేమింగ్ షో ల ఏర్పాటు చేయనున్నారు. అవతరణ వేడుకలో భాగంగా సందర్శకుల వినోదం కోసం ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేయనున్న స్టాళ్లు రేపటి నుంచే అందుబాటులోకి రానున్నాయి. జూన్ 2న రాత్రి 7 నుంచి 9 గంటల వరకు ట్యాంక్‌బండ్ వద్ద అవతరణ వేడుకలను ఘనంగా కొనసాగనున్నాయి.
ఆ రోజే రాష్ట్ర గీతం.. జాతికి అంకితం
రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా.. జూన్ 2న ఉదయం 10:35 గంటలకు రాష్ట్ర గీతమైన ‘జయజయహే తెలంగాణ’ను ప్రభుత్వం జాతికి అంకితం చేయనుంది. మూడు చరణాలతో కూడిన రెండున్నర నిమిషాల వెర్షన్‌ను ఈ కార్యక్రమంలో ఆవిష్కరించనున్నారు. 10:35 గంటలకు మొదలుపెట్టి.. 10:37:30 సెకన్ల వరకూ ఈ గీతాన్ని వినిపించనున్నారు. దీంతోపాటు.. 13:30 నిమిషాల నిడివిగల పూర్తిగీతాన్ని కూడా సర్కారు ఓకే చేసింది. కాగా.. కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ ఈ వేడుకల్లో పాల్గొననున్నారు. రాష్ట్ర గీతం ఆవిష్కరణ అనంతరం ఐదు నిమిషాలపాటు ఆమె ప్రసంగించనున్నారు. సోనియాతో పాటు రాహుల్, ప్రియాంక గాంధీల్లో ఎవరో ఒకరు ఈ కార్యక్రమానికి వచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. కాగా.. జూన్ 2న ఉదయమే కాక.. సాయంత్రం కూడా పలు కార్యక్రమాలు ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఆరోజు ఉదయం 9:30 గంటలకు సీఎం రేవంత్ అమర వీరులకునివాళులర్పించడంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. మళ్లీ సాయంత్రం ట్యాంక్‌బండ్ వద్ద కార్నివాల్‌తో వేడుకలు ప్రారంభమై రాత్రి 9 గంటలకు ముగియనున్నాయి.
————–