* చనిపోయిన తండ్రి వద్ద ఓ బిడ్డ ఆక్రందన
* పాల ప్యాకెట్ కోసం బయటకు రాగా ప్రమాదం
* కలచివేసిన ఘటన
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ‘నాన్నా.. లే నాన్నా.. ఆకలేస్తంది.. లే నాన్నా.., ఇంటికి పోదాం లే’ .. రోడ్డు ప్రమాదంలో చనిపోయిన తండ్రి వద్ద ఓ బిడ్డ చేస్తున్న ఆక్రమందన ఇది. అక్కడి రక్తం చూసి భయపడుతూ, తండ్రిని లేపుతూ ఆ చిన్నారి వేదన స్థానికులను కలచివేసింది. కొడుకు ఆకలి తీర్చడం కోసం అతడితో కలిసి పాల ప్యాకెట్ కోసం వచ్చిన ఆ తండ్రిని మృత్యువు కబళించింది. డీసీఎం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలంలోని పసివేదుల గ్రామానికి చెందిన శెట్టి కనకప్రసాద్ (30)కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిలో రెండేండ్ల శివకుమార్ పెద్దవాడు. చిన్నవాడి వయసు ఆరునెలలే. ప్రైవేటు ఉద్యోగం చేస్తూ జీవనోపాధి పొందుతున్న కనకప్రసాద్ మూడునెలల కిందట అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని ఇనామ్గూడకు వచ్చాడు. తల్లి, భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి ఇక్కడే నివసిస్తున్నాడు.
ఇంట్లో కుటుంబసభ్యుల కోసం టిఫిన్లు, పిల్లలకు పాల ప్యాకెట్లు తీసుకొచ్చేందుకు కనకప్రసాద్ తన రెండేండ్ల కొడుకు శివకుమార్‌తో కలిసి బైక్‌పై బయలుదేరాడు. విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న అబ్దుల్లాపూర్‌మెట్ చౌరస్తాలో టిఫిన్లు, పాల ప్యాకెట్లు తీసుకుని, తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో ఇనామ్‌గూడ కమాన్ ఎదురుగా యూటర్న్ తీసుకుంటుండగా.. అదే సమయంలో వెనకనుంచి అతివేగంగా వచ్చిన డీసీఎం వీరి బైక్‌ను ఢీకొట్టింది. కనకప్రసాద్తో పాటు కొడుకు శివకుమార్ రోడ్డుపై పడిపోయారు. కనకప్రసాద్కు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. శివకుమార్‌కు సైతం గాయాలయ్యాయి. కళ్ల ముందే తండ్రి విగతజీవిగా పడి ఉండగా.. ‘నాన్నా లే.. ఇంటికి పోదాం.. ఆకలేస్తుంది’ అంటూ చిన్నారి చేసిన రోదనలు అటుగా వెళ్తున్న వారిని కంటతడిపెట్టించాయి. తండ్రి లేచి ఎత్తుకోలేడన్న విషయాన్ని సైతం తెలియని పసిహృదయం.. మృతదేహాన్ని చూస్తూ ఏడ్వడం అక్కడ విషాదాన్ని నింపింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
——————