ఆకేరు న్యూస్, ములుగు: కోట్లాది మంది భక్తులతో కిక్కిరిసిన మేడారం వనదేవతల జాతర ప్రశాంతంగా ముగిసింది. అయితే, జాతర ముగిసిన తర్వాత మేడారం పరిసరాల్లో పేరుకుపోయిన టన్నుల కొద్దీ చెత్తను తొలగించడం ఇప్పుడు అధికారులకు, పారిశుద్ధ్య కార్మికులకు ఒక పెద్ద సవాలుగా మారింది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది వ్యర్థాల అంచనా భారీగా ఉంది గణాంకాల ప్రకారం… సుమారు 3,000 టన్నుల పైచిలుకు వ్యర్థాలు పేరుకుపోయినట్లు అంచనా.ఇందులో 1,021 టన్నుల మేర ప్లాస్టిక్ వ్యర్థాలే ఉన్నాయి. సుమారు 1,500 టన్నుల మేర కొబ్బరి చిప్పలు, బెల్లం, అన్నం మరియు ఇతర ఆహార పదార్థాలు భూమిలో కలిసిపోయేవిగా ఉన్నాయి.సుమారు 420 టన్నుల జంతు వ్యర్థాలు ఉండటం వల్ల దుర్వాసన వచ్చే ప్రమాదం ఉంది. యుద్ధ ప్రాతిపదికన క్లీనింగ్ ఆపరేషన్ స్థానిక గిరిజన గ్రామాలకు వ్యాధులు ప్రబలకుండా ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం భారీ చర్యలు చేపట్టింది.సుమారు 5,000 మంది పారిశుద్ధ్య కార్మికులు మేడారం అడవులను శుభ్రం చేసే పనిలో నిమగ్నమయ్యారు.50కి పైగా ట్రాక్టర్ల ద్వారా సేకరించిన చెత్తను 20 వేర్వేరు డంపింగ్ యార్డులకు తరలిస్తున్నారు. జంపన్న వాగు, చిలకలగుట్ట, ఆర్టీసీ బస్టాండ్ మరియు గద్దెల పరిసరాల్లో నిరంతరం క్లీనింగ్ జరుగుతోంది.ఈసారి జాతరలో బాటిళ్ల వ్యర్థాలు ఆందోళన కలిగిస్తున్నాయి. సుమారు 100 టన్నుల గాజు సీసాలు పేరుకుపోయాయి. ఇందులో 50 శాతం పగిలిపోవడంతో, పంట పొలాల్లోకి వెళ్లే రైతులకు, కూలీలకు మరియు అడవిలోని మూగజీవాలకు ఇవి గాయాలు చేసే ప్రమాదం ఉంది.కేవలం పారిశుద్ధ్య కార్మికులే కాకుండా, ఓరుగల్లు యువత, విద్యార్థులు, ఎన్సీసీ బృందాలు మరియు స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ ‘స్వచ్ఛ మేడారం’ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని అధికారులు కోరుతున్నారు. 2020లో సీఆర్పీఎఫ్ జవాన్లు చేసిన సేవలను గుర్తు చేస్తూ, అదే స్ఫూర్తితో అందరూ ముందుకు రావాలని భక్తులు ఆకాంక్షిస్తున్నారు.
…………………………………………………
