అన్నీ “హస్త”గతమే రేవంత్ లక్ష్యం!!
* మునిసిపల్ ఎన్నికల్లో స్వయంగా రంగంలోకి
* మరోవైపు క్షేత్రస్థాయిలో మంత్రులకు విధులు
* క్వీన్ స్వీప్ చేయడమే కాంగ్రెస్ లక్ష్యం
* లక్ష్యసాధనకు కొన్ని అడ్డంకులు.. అధిగమించేనా?
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ
అసెంబ్లీ ఉప ఎన్నికలు, పంచాయతీ ఎన్నికల్లో వరుస విజయాలు నమోదు చేసుకున్న అధికార కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం మునిసిపల్ ఎన్నికలపై ప్రధానంగా దృష్టి సారించింది. ఒక్క స్థానాన్ని కూడా చేజార్చుకోకుండా మొత్తం హస్తగతం చేసుకోవాలని లక్ష్యం నిర్దేశించుకుంది. లక్ష్య సాధనకు ఎన్ని అడ్డంకులు ఎదురైనా అధిగమించి విజయం సాధించాలని విశేషంగా కృషి చేస్తోంది. ఇందుకోసం స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. అసెంబ్లీ ఉప ఎన్నికలు, పంచాయతీ ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాలకు మించి కసరత్తు చేస్తున్నారు. తక్షణం మంత్రులు అందరూ క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించి ఆయన తాను కూడా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు.
తొలిసభలోనే తనదైన శైలిలో..
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మిర్యాలగూడలో బుధవారం ఏర్పాటు చేసిన తొలి భారీ బహిరంగ సభలోనే రేవంత్ తనదైన శైలిలో ప్రసంగిస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. విపక్షాలపై విసుర్లు.. సంక్షేమ పథకాల వివరాలు.. భవిష్యత్ లో చేయబోయే పనులు.. ఇలా అన్ని అంశాలపైనా మిర్యాలగూడ సభలో రేవంత్ దృష్టి సారించారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. ఫోన్ ట్యాపింగ్ కేసును ప్రస్తావిస్తూ భార్యాభర్తల ఫోన్లు ఎవరైనా వింటారా? అని ప్రశ్నించారు. సినిమా తారల ఫోన్లు సైతం విన్నారని తెలిపారు. జాతిపితకు నోటీసులు ఇస్తారా? అని ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ కేడర్ తీరుపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు జాతిపిత.. మీ జాతి ఏంటి?.. నీతి ఏంటి? అంటూ బీఆర్ఎస్ అగ్రనేతలపై నిప్పులు చెరిగారు. దోపిడీ చేసిన దొంగలు జాతిపిత ఎలా అవుతారు? అంటూ వారిని సీఎం రేవంత్ సూటిగా ప్రశ్నించారు.
మహిళలను ఆకట్టుకోవడమే లక్ష్యంగా..
విపక్షాలను విమర్శించడమే కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన సంక్షేమ పథకాలను, వాటి ద్వారా రాష్ట్రానికి, ప్రజలకు కలిగిన మేలును వివరిస్తూ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని ఈ సందర్భంగా ప్రజలను కోరారు. తమ ప్రభుత్వం లక్షలాది మందికి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసిందని, 3.15 కోట్ల మందికి సన్నబియ్యం ఇస్తున్నామని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. 50 లక్షల పేద కుటుంబాలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అందిస్తోందని వివరించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాతే వరికి రూ.500 బోనస్ ఇస్తున్నామని తెలిపారు. గతంలో వరి వేస్తే ఉరే అని కేసీఆర్ అన్నారని గుర్తు చేస్తూ గత ప్రభుత్వంలోని లోపాలను ఎత్తిచూపే ప్రయత్నం చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామన్నారు. ఆడబిడ్డలంతా కాంగ్రెస్కు ఓటు వేస్తే.. ప్రతిపక్షాలు బీఆర్ఎస్, బీజేపీలకు డిపాజిట్లు సైతం రావన్నారు. తమ ప్రభుత్వం చేసిన పనులు చూసి ఓటు వేయాలని కోరుతున్నామని విజ్ఞప్తి చేడం ద్వారా రేవంత్ చతురతను చాటారు.
లక్ష్యం సాధించేనా?
స్వయంగా ప్రచార బాధ్యతలను చేపట్టిన రేవంత్.. డిసెంబర్-5 కరీంనగర్ జిల్లా చొప్పదండిలో పర్యటన, బహిరంగ సభ లో పాల్గొననున్నారు. డిసెంబర్-6న నిజామాబాద్ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. డిసెంబర్-7 రంగారెడ్డి జిల్లాలోని పరిగి నియోజకవర్గంలో పర్యటిస్తారు. డిసెంబర్-8న వరంగల్ జిల్లా భూపాలపల్లిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. డిసెంబర్-9మెదక్ జిల్లా పర్యటనతో ప్రచారం ముగుస్తుంది. మరోవైపు మంత్రులతో కూడా క్షేత్రస్థాయిలో ప్రచారం చేయిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు వారితో సమావేశమైన రేవంత్.. ఈ ఎన్నికల్లో గెలవాల్సిన ఆవశ్యకతను వివరించారు. ఒక్క సీటు కూడా కోల్పోకుండా క్వీన్ స్వీప్ చేసేలా విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. అభ్యర్థుల వెంబడి ఉండి గెలిపించుకోవాల్సిన బాధ్యత మంత్రులదే అని ఇప్పటికే వారికి వెల్లడించారు. టికెట్ రాలేదన్న అసంతృప్తితో ఉన్నవారిని బుజ్జగించి, లక్ష్య సాధనకు ఎటువంటి అడ్డంకులూ లేకుండా కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోంది. ఎంత వరకు వాటిని అధిగమిస్తుందో వేచి చూడాలి.
