ఆకేరు న్యూస్,డెస్క్ : లోన్ రికవరీ పేరుతో సామాన్యులను ఇబ్బంది పెట్టే బ్యాంకులు మరియు రికవరీ ఏజెంట్లపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.ఇటీవల ‘శాంతి ప్రసాద్ వర్సెస్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ కేసులో జస్టిస్ విక్రమ్ నాథ్ మరియు జస్టిస్ K.V. విశ్వనాధన్‌లతో కూడిన ధర్మాసనం కీలక తీర్పునిచ్చింది. అప్పు తీసుకోవడం అనేది కేవలం ఒక ఒప్పందం మాత్రమేనని, అది నేరం కాదని కోర్టు స్పష్టం చేసింది. రికవరీ ప్రక్రియ చట్టబద్ధంగా ఉండాలే తప్ప, గూండాయిజంతో కాదని హెచ్చరించింది.
రికవరీ ఏజెంట్ల వేధింపులపై మీకున్న హక్కులు ఇవే:
బ్యాంకులు తమ రికవరీ పనిని అవుట్సోర్స్ ఏజెన్సీలకు ఇచ్చినప్పటికీ, ఆ ఏజెంట్లు చేసే అక్రమాలకు బ్యాంకులే బాధ్యత వహించాలి .
సమయ పాలన: రికవరీ ఏజెంట్లు ఉదయం 8 గంటల కంటే ముందు, రాత్రి 7 గంటల తర్వాత ఫోన్ చేయకూడదు.
గోప్యత: మీ అనుమతి లేకుండా ఇంటికి రావడం లేదా మీ బంధువులకు ఫోన్ చేసి మీ పరువు తీయడం చట్టవిరుద్ధం. ఇది ఆర్టికల్ 21 కింద ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుంది.
మర్యాదపూర్వక ప్రవర్తన: బూతులు తిట్టడం, బెదిరించడం వంటివి చేస్తే కఠిన చర్యలు తప్పవు.
రికార్డింగ్: ఏజెంట్ల ఫోన్ కాల్స్ లేదా వారి ప్రవర్తనను రికార్డ్ చేయండి.
పోలీస్ ఫిర్యాదు: బూతులు తిడితే BNS సెక్షన్ 296, బెదిరింపులకు పాల్పడితే BNS సెక్షన్ 351 కింద పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు.
RBI కి ఫిర్యాదు: నేరుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వెబ్సైట్లో ఫిర్యాదు చేయండి. నిబంధనలు అతిక్రమిస్తే సదరు బ్యాంకు లైసెన్స్‌ను రద్దు చేసే అధికారం కూడా RBIకి ఉందని సుప్రీంకోర్టు గుర్తు చేసింది.
ఈ కేసులో వేధింపులకు గురైన బాధితుడికి రూ. 5,00,000 లక్షల పరిహారం చెల్లించాలని కోర్టు బ్యాంకును ఆదేశించింది. బ్యాంకులు తమ ఏజెంట్లకు క్రమశిక్షణ నేర్పకపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని వార్నింగ్ ఇచ్చింది.
