* పోలీస్ సమాచారం లీక్ చేయడం
* వ్యాపార వేత్త తో ఆర్థిక సంబందాలే కారణం
* రాష్ట్రంలో కలకలం
ఆకేరు న్యూస్ , డెస్క్ : ఛత్తీస్‌గఢ్ డీఎస్పీ (DSP) కల్పనా వర్మ ( Kalpana Varma ) ను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కల్పనా వర్మ విధి నిర్వహణలో నిర్లక్ష్యం , సీనియర్ అధికారుల ఆదేశాలను ధిక్కరించడం కారణాలుగా తెలుస్తోంది. ముఖ్యంగా పోలీస్ శాఖకు సంబందించిన రహస్య సమాచారాన్ని ఇతరులకు చేరవేయడం కూడా ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు. అదే విదంగా అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ADG) స్థాయి అధికారితో ఈ కేసుపై లోతైన విచారణకు ప్రభుత్వం ఆదేశించింది.
కాగా రాయ్‌పూర్‌కు చెందిన హోటల్ వ్యాపారవేత్త ఒకరు డీఎస్పీ కల్పనా వర్మపై సంచలన ఆరోపణలు చేశారు. 2021లో తమ మధ్య పరిచయం ఏర్పడిందని, అది క్రమంగా సాన్నిహిత్యంగా మారిందని దీపక్ పేర్కొన్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనను “లవ్ ట్రాప్”లో పడేసిందని ఆయన ఆరోపించారు.
ఈ నాలుగేళ్ల కాలంలో ఆమె తన నుంచి సుమారు ₹2.5 కోట్లు వసూలు చేసినట్లు ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా తన సోదరుడి పేరు మీద హోటల్ రిజిస్టర్ చేయాలని ఆమె ఒత్తిడి తెచ్చిందని, ఆ తర్వాత దానిని తన పేరు మీదకు మార్చుకుందని దీపక్ టాండన్ ఆరోపించారు.
ఈ ఫిర్యాదుపై ప్రభుత్వం అదనపు ఎస్పీ (Additional SP) స్థాయి అధికారితో విచారణ జరిపించింది.
విచారణాధికారులు దాదాపు 1,475 పేజీల సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు.
ఈ విచారణలో కల్పనా వర్మ తన పదవిని దుర్వినియోగం చేసినట్లు, అక్రమంగా ఆర్థిక ప్రయోజనాలు పొందినట్లు మరియు ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నట్లు ప్రాథమిక ఆధారాలు లభించాయి.
ముఖ్యంగా, ఆమె తన వాట్సాప్ (WhatsApp) ద్వారా పోలీసు శాఖకు సంబంధించిన అత్యంత రహస్యమైన , సున్నితమైన సమాచారాన్ని (Intelligence Information) సదరు వ్యాపారవేత్తతో పంచుకున్నట్లు విచారణలో తేలింది. ఇది సివిల్ సర్వీస్ ప్రవర్తనా నియమావళిని తీవ్రంగా ఉల్లంఘించడమేనని ప్రభుత్వం పేర్కొంది.
*అవన్నీ తప్పుడు ఆరోపణలు : డీఎస్పీ కల్పనా వర్మ
తన ప్రతిష్టను దిగజార్చడానికి జరుగుతున్న కుట్ర లో భాగమే వ్యాపారి ఆరోపణలు చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు.సదరు వ్యాపారవేత్తకు తన తండ్రితో ఉన్న ఆర్థిక వివాదాల కారణంగానే తనపై ఇటువంటి నిందలు వేస్తున్నారని ఆమె వాదించారు. సస్పెన్షన్ కాలంలో ఆమెను నవ రాయ్‌పూర్‌లోని పోలీస్ హెడ్ క్వార్టర్స్‌కు (PHQ) అటాచ్ చేశారు. ఆమెపై తదుపరి విచారణ కొనసాగుతోంది..
————–
