*హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు!
ఆకేరు న్యూస్,దుబ్బాక: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీలో ఆయన పర్యటించారు. చెల్లాపూర్ వార్డులో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించిన హరీష్ రావు, కాంగ్రెస్ రెండేళ్ల పాలనపై విరుచుకుపడ్డారు.కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు 420 హామీలు ఇచ్చి, ఒక్కటి కూడా సరిగ్గా అమలు చేయకుండా మోసం చేసిందని హరీష్ రావు ఆరోపించారు. మహిళలకు కేవలం ఉచిత బస్సు సౌకర్యం కల్పించి, మిగిలిన హామీలను అటకెక్కించారని మండిపడ్డారు. రేవంత్ పాలనలో అభివృద్ధి శూన్యమని, కేవలం మాటల గారడీతోనే కాలం గడుపుతున్నారని విమర్శించారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రమంతా తిరుగుతున్నా, ఉమ్మడి మెదక్ జిల్లాకు రావడానికి మాత్రం భయపడుతున్నారని హరీష్ రావు ఎద్దేవా చేశారు. “మెదక్లో హరీష్ రావు ఉన్నాడని రేవంత్ రెడ్డికి భయం పట్టుకుంది. ఇక్కడి ప్రజలు ఎన్నికల ముందు ఇచ్చిన గ్యారంటీలు, హామీల గురించి తనను నిలదీస్తారని ఆయనకు తెలుసు” అని వ్యాఖ్యానించారు. మెదక్ జిల్లాలో ఒక్క వార్డులో కూడా కాంగ్రెస్ గెలవదని ఆయన ధీమా వ్యక్తం చేశారు.పథకాలు కావాలంటే ‘కారు’కే ఓటెయ్యాలికేసీఆర్ హయాంలో దుబ్బాకలో ఆసుపత్రులు, బడులు, గుడులు నిర్మించామని.. కాంగ్రెస్ ఈ రెండేళ్లలో ఒక్కటైనా అభివృద్ధి పని చేసిందా? అని హరీష్ రావు ప్రశ్నించారు.కేసీఆర్ ఇచ్చిన పథకాలు కొనసాగాలన్నా, కొత్త అభివృద్ధి పనులు జరగాలన్నా బీఆర్ఎస్ను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని కోరారు.ఆగస్టు 15 కల్లా రుణమాఫీ పూర్తి చేస్తానని దేవుళ్లపై ఒట్టు వేసిన రేవంత్ రెడ్డి, ఆ మాట నిలబెట్టుకోలేదని దుయ్యబట్టారు.జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగులను మోసం చేశారని, కానీ ప్రతి నెల ఏదో ఒక స్కామ్ మాత్రం బయటకు వస్తోందని ఆయన విమర్శించారు.
