Delhi Congress Protest
* మోదీ రాజీనామాకు రాహుల్ గాంధీ డిమాండ్
చేతులకు సంకెళ్లతో కాంగ్రెస్ నేతల వినూత్న నిరసన
ఆకెరు న్యూస్, న్యూఢిల్లీ:
దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నీట్ (NEET) పేపర్ లీకేజీ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరికి నిరసనగా, అలాగే విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్‌ను తీవ్రంగా ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రోడ్డెక్కాయి. సిజెపి (CJP) వద్ద నిర్వహించిన నిరాహార దీక్షలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో పాటు పలువురు కాంగ్రెస్ ఎంపీలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
* చేతులకు సంకెళ్లతో వినూత్న నిరసన
ప్రభుత్వ నిరంకుశత్వానికి, గుండాగిరి వైఖరికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు కాళ్లకు, చేతులకు సంకెళ్లు వేసుకుని నిరసన తెలిపారు. “కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో జవాబుదారీతనం పూర్తిగా లోపించింది. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న నీట్ లీకేజీ వ్యవహారంపై పార్లమెంట్లో చర్చ జరిపేందుకు కూడా ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు” అని రాహుల్ గాంధీ మండిపడ్డారు.
* ప్రధాని మోదీ మౌనం వీడాలి!
ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. యువతపై లాఠీచార్జ్ చేయించడం అత్యంత దారుణమన్నారు. దేశంలోని లక్షలాది మంది విద్యార్థులు, యువత భవిష్యత్తును నాశనం చేసినందుకు బాధ్యత వహిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నీట్ అంశంపై ప్రధాని మోదీ తక్షణమే మౌనం వీడి, స్పష్టమైన సమాధానం చెప్పాలని ఆయన సూచించారు. అంతేకాకుండా విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తున్న విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
* పోలీసుల నిర్బంధం
మరోవైపు శాంతియుతంగా ధర్నా నిర్వహిస్తున్న పలువురు కాంగ్రెస్ నేతలను, కార్యకర్తలను పోలీసులు బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించి స్టేషన్లకు తరలించారు. ఈ క్రమంలో పోలీసులకు, కాంగ్రెస్ శ్రేణులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. కాంగ్రెస్ నేతల అరెస్టులతో ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
———–
