ఆకేరు న్యూస్, వరంగల్: వరంగల్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఈ నెల 11న (బుధవారం) ఎన్నికలు జరగనున్న జనగామ, ఘన్పూర్, వర్ధన్నపేట, పరకాల, నర్సంపేట మున్సిపాలిటీల పరిధిలో నిషేధాజ్ఞలు విధిస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో బి.ఎన్.ఎస్.ఎస్ (BNSS) సెక్షన్ 163 అమలులో ఉంటుంది.ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుంపులుగా చేరడం నిషిద్ధం.రేపు (10వ తేదీ) ఉదయం 6 గంటల నుండి ఎల్లుండి (11వ తేదీ) రాత్రి 8 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఓటర్లు ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలని , ఎవరైనా ఈ ఉత్తర్వులను అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ హెచ్చరించారు.
