Vijayashanti Shabad Murder Case
* రాజ్‌కుమార్ ఆత్మహత్యతో ఈ కేసు ముగియలేదు..
ఆకేరు న్యూస్, హైదరాబాద్: పోక్సో (POCSO) కేసులో నిందితుడిని అరెస్ట్ చేయకుండా పోలీసులు లంచం తీసుకున్నారన్న ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు విజయశాంతి తీవ్రంగా స్పందించారు. పోలీసుల నిర్లక్ష్యం, లంచగొండితనం వల్లే ఆరుగురి ప్రాణాలు బలయ్యే పరిస్థితి వచ్చిందని ఆమె ఆరోపించారు. ఈ వ్యవహారం మహిళా లోకాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
* పోలీసుల తప్పిదమే శాపమైంది..
రాజ్‌కుమార్ ఆత్మహత్య చేసుకున్నంత మాత్రాన ఈ కేసు ముగిసిపోయినట్లు కాదని విజయశాంతి స్పష్టం చేశారు. బాధ్యతాయుతమైన పోలీస్ శాఖలో ఇలాంటి లోపాలు తలెత్తడం, నిందితుల నుంచి లంచాలు తీసుకుని కేసులను పక్కదారి పట్టించడం వల్ల రాష్ట్రంలో మహిళల భద్రతపై తీవ్ర అనుమానాలు రేకెత్తుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులే ఇలా అక్రమాలకు పాల్పడితే సామాన్యులకు దిక్కెవరని ప్రశ్నించారు.
* కాంగ్రెస్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి..
మహిళల భద్రతకు, సంక్షేమానికి తాము పెద్దపీట వేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తోందని.. అలాంటప్పుడు ఇలాంటి ఘటనలపై అత్యంత కఠినంగా వ్యవహరించాలని విజయశాంతి కోరారు.
* శాంతిభద్రతల విషయంలో ప్రభుత్వం ఎలాంటి రాజీ పడకూడదు.
ఈ ఘటనకు కారణమైన పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా వ్యవస్థను ప్రక్షాళన చేయాలి.
ఈ ఘోర తప్పిదానికి కారణమైన వారిపై ప్రభుత్వం తక్షణమే స్పందించి, బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని విజయశాంతి డిమాండ్ చేశారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
