*అక్రమ ఇసుక రవాణా వద్దు.. ఊరి బాగు కోసం ప్రతిజ్ఞ చేద్దాం…
ఆకేరు న్యూస్, జనగామ: అక్రమ ఇసుక రవాణాను అరికట్టేందుకు దేవరుప్పుల మండల పోలీసులు వినూత్న మార్గాన్ని ఎంచుకున్నారు. కేవలం కేసులు, జరిమానాలతోనే కాకుండా ప్రజల్లో మార్పు తీసుకురావాలనే సంకల్పంతో దేవరుప్పుల ఎస్సై ఊర సృజన్ కుమార్ శనివారం దాదాసాహెబ్ కాలనీలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు… దేవరుప్పుల మండల కేంద్రంలోని దాదాసాహెబ్ కాలనీ సమీపంలో ఉన్న వాగు నుండి కొంతకాలంగా అక్రమంగా ఇసుక రవాణా జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో ఎస్సై సృజన్ కుమార్ తన సిబ్బందితో కలిసి కాలనీని సందర్శించారు. అక్రమ రవాణా వల్ల కలిగే అనర్థాలను గ్రామస్తులకు వివరించారు. కేవలం హెచ్చరికలతో సరిపెట్టకుండా, కాలనీ వాసులందరితో ఎస్సై ప్రతిజ్ఞ చేయించారు. “మేము ఇకపై అక్రమ ఇసుక రవాణా చేయము.. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే పోలీసులకు సమాచారం అందిస్తాం” అంటూ గ్రామస్తులు ప్రమాణం చేశారు.
ప్రతిజ్ఞలోని ముఖ్యాంశాలు:
*ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుకను తరలించబోమని నిశ్చయించుకోవడం.
*అక్రమ రవాణాకు పాల్పడే వారి వివరాలను బాధ్యతగా పోలీసులకు తెలపడం.
*నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన కఠిన చర్యలకు సిద్ధమని అంగీకరించడం.
ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ కోసం, భూగర్భ జలాలు అడుగంటకుండా ఉండాలంటే ఇసుక అక్రమ రవాణాను అరికట్టడం అందరి బాధ్యతని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బందితో పాటు కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పోలీసుల ఈ వినూత్న ప్రయత్నం పట్ల స్థానికంగా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. భవిష్యత్తులో ఇసుక మాఫియాకు ఈ చర్య అడ్డుకట్ట వేస్తుందని భావిస్తున్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
