బీటెక్ విద్యార్థినిపై గంజాయి చాక్లెట్లతో లైంగిక దాడి..
తోటి విద్యార్థుల ఘాతుకం!
ఆకేరు న్యూస్, హైదరాబాద్: విజ్ఞానాన్ని అందించాల్సిన విద్యాలయాలు వికృత చేష్టలకు వేదికలుగా మారుతున్నాయి. హైదరాబాద్‌లోని బాచుపల్లి (ప్రగతి నగర్) పరిధిలో గల ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో చోటుచేసుకున్న అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తనతో కలిసి చదువుకుంటున్న తోటి విద్యార్థినిపై గంజాయి కలిపిన చాక్లెట్లు ఇచ్చి లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా, నెలల తరబడి బ్లాక్మెయిల్ చేసిన ఉదంతం స్థానికంగా కలకలం రేపింది.
బాధితురాలు అదే కళాశాలలో ఇంజనీరింగ్ తృతీయ సంవత్సరం చదువుతోంది. మెకానికల్ బ్రాంచ్‌కు చెందిన ఆశిష్ (21) అనే విద్యార్థి ఏడాదిన్నర కాలంగా ఆమెను ప్రేమ పేరుతో వేధిస్తూ వచ్చాడు. పక్కా ప్లాన్‌తో ఆమెకు గంజాయి కలిపిన చాక్లెట్లు ఇచ్చాడు. ఆమె స్పృహ కోల్పోగానే కళాశాల తరగతి గదిలోనే ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ దృశ్యాలను ఫోటోలు, వీడియోలు తీసి.. సోషల్ మీడియాలో పెడతానని బెదిరిస్తూ పలుమార్లు ఓయో (OYO) రూమ్‌లకు తీసుకువెళ్లి అకృత్యాలకు పాల్పడ్డాడు.
మరో నిందితుడి వేధింపులు:
ఆశిష్ ఒక్కడే కాకుండా అతని స్నేహితుడు ప్రవీణ్ కూడా బాధితురాలితో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఆశిష్ తన కోరిక తీర్చుకున్నట్లే, తను కూడా లొంగిపోవాలని వేధించేవాడు. ఈ నెల 17న ప్రవీణ్ ఆమెపై దాడికి ప్రయత్నించగా, తృటిలో తప్పించుకున్న బాధితురాలు మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ క్రమంలోనే అసలు విషయం తన తల్లికి చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
యాజమాన్యం నిర్లక్ష్యంపై విమర్శలు:
ఇంతటి దారుణం కళాశాల ఆవరణలోనే జరుగుతున్నా, సెక్యూరిటీ లేదా యాజమాన్యం కనిపెట్టలేకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లుత్తుతున్నాయి. బాధితురాలు కళాశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా, వారు విషయాన్ని బయటకు రానివ్వకుండా తొక్కిపెట్టే ప్రయత్నం చేశారని ఆరోపణలు వస్తున్నాయి. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే నిందితులు రెచ్చిపోయారని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బాధితురాలి తల్లి శనివారం బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.
