*మియాపూర్‌లో దారుణం…
*రెండో పెళ్లి చేసుకుందని మహిళపై కత్తితో దాడి!
ఆకేరు న్యూస్, హైదరాబాద్: నగరంలోని మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపే ఘటన వెలుగుచూసింది. తనను కాదని మరో వ్యక్తిని పెళ్లి చేసుకుందన్న కక్షతో, ఒక మహిళపై ఉన్మాదిలా ప్రవర్తించిన వ్యక్తి కత్తితో ప్రాణాంతక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
*పరిచయం కాస్తా పగగా మారింది..
ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడకు చెందిన నూకరత్నం అనే మహిళ బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వలసవచ్చింది. గతంలోనే భర్తను కోల్పోయిన ఆమెకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. మియాపూర్ పరిసర ప్రాంతాల్లో హౌస్‌కీపింగ్ పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటోంది. ఆమె పనిచేసే చోటే ఆలీషా అలియాస్ పాండు అనే వ్యక్తి వంటమనిషిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది.
*వివాహమే వివాదానికి కారణం!
నూకరత్నం గత నెల (ఫిబ్రవరి) 20వ తేదీన ప్రసాద్ అనే వ్యక్తిని రెండో వివాహం చేసుకుంది. అయితే, ఈ విషయం తనకు చెప్పలేదన్న కోపంతో ఆలీషా ఆమెపై తీవ్రమైన కక్ష పెంచుకున్నాడు. తన మాట కాదని ప్రసాద్‌ను ఎలా పెళ్లి చేసుకుంటుందని ఆమెపై పగ తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు.
*ఇంటికి వెళ్లి ఘర్షణ.. ఆపై దాడి
ఈ నెల 19వ తేదీన పథకం ప్రకారం ఆలీషా తన తండ్రి లాలూ, స్నేహితుడు జాన్‌తో కలిసి నూకరత్నం నివసిస్తున్న ఇంటికి వెళ్ళాడు. తన వెంట రావాలని ఆమెను బలవంతం చేశాడు. దీనికి నూకరత్నం నిరాకరించడంతో గొడవ మొదలైంది. తీవ్ర ఆగ్రహానికి లోనైన ఆలీషా, వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో నూకరత్నం శరీర భాగాలపై తీవ్ర గాయాలయ్యాయి.
*ఆస్పత్రిలో బాధితురాలు.. కటకటాల్లో నిందితులు
తీవ్ర రక్తస్రావంతో పడి ఉన్న నూకరత్నాన్ని గమనించిన స్థానికులు వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న మియాపూర్ పోలీసులు వేగంగా స్పందించారు. ప్రధాన నిందితుడు ఆలీషాతో పాటు అతనికి సహకరించిన తండ్రి లాలూను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మరో నిందితుడు జాన్ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.
