* ఎదగని కోడి.. గిట్టబాటుకాని ధర
* ప్రతికూల వాతావరణ పరిస్థితులు
* రూ.400 చేరిన స్కిన్లెస్ చికెన్ రేటు
ఆకేరు న్యూస్, డెస్క్ :
వేసవి ఎండలు ముదిరాయి. పొద్దంతా ఎండ, రాత్రిపూట చలి వాతావరణం కోళ్లకు ప్రాణసంకటంగా మారింది. అధిక వేడి కారణంగా దాణా తక్కువ తీసుకుని, నీరు అధికంగా తాగుతుండడంతో కోళ్లలో ఎదుగుదల మందగించింది. ఈ ప్రతికూల వాతావరణ పరిస్ఖితుల కారణంగా మరణాలుకూడా అధికంగా సంభవిస్తున్నాయి. ఫామ్‌ల నిర్వహణ భారంగా పరిణమించడంతో ధరలు పెంచాల్సి వస్తందని వ్యాపారులు చెబుతున్నారు.
* కొనడానికి వెనకడుగు..
సండే వచ్చిందంటే ముక్కలేనిదే ముద్ద దిగదు. సామాన్య, మధ్యతరగతి కుటుంబాల్లో పండుగ వాతావరణం ఉంటుంది. అలాంటిది చికెన్ ధరలు ఒక్కసారిగా పెరగడంతో వినియోగదారులు కొనడానికి వెనకాడుతున్నారు. ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా చికెన్ ధరలు వారం రోజుల్లోనే సుమారు రూ.80 నుండి రూ.100 వరకు పెరిగాయి. వేసవి ప్రారంభంలోనే ఎండల తీవ్రత పెరగడం వల్ల కోళ్లలో ఎదుగుదల లోపించిందని, గిట్టుబాటు కాక వ్యాపారులు ధరలు పెంచినట్లు తెలుస్తోంది.
* తగ్గిన ఉత్పత్తి – పెరిగిన వినియోగం
వేసవి వేడి తీవ్రత పెరగడంతో పౌల్ట్రీ ఫారాల్లో కోళ్ల మరణాలు పెరుగుతున్నాయి. పొద్దంతా ఎండ.. రాత్రి సమయంలో చలిగా ఉంటున్నది. ఈ ప్రతికూల వాతావరణం కూడా కోళ్ల మరణాలకు కారణం అవుతోంది. అంతే కాకుండా కోళ్లు వేసవి తాపంతో నీరు ఎక్కువ తీసుకుని.. దాణా తక్కువ తినడం వల్ల బరువు తగ్గుతున్నాయి. ఇంతకు ముందు రెండు కేజీల పైన ఉండే కోళ్లు ఇప్పుడు కేజీన్నర లోపే ఉంటున్నాయి. దీనికితోడు కోళ్ల ఫారాల్లో కూలర్లు, ఏసీల వినియోగం అధికమై నిర్వహణ, రవాణా చార్జీలు భారంగా మారుతున్నాయని, పెరిగిన ఖర్చుల కారణంగా గిట్టుబాటు కావడంలేదని వ్యాపారులు చెబుతున్నారు.
నష్టాలను నివారించడానికి చాలా మంది చిన్న, మధ్యతరహా రైతులు కోళ్ల పెంపకాన్ని తగ్గించారు. ప్రస్తుతం వివాహాలు, ఇతర శుభకార్యాలు, పండుగల సీజన్ కావడంతో చికెన్ వినియోగం ఒక్కసారిగా పెరిగింది. ఉత్పత్తి తగ్గిపోయి డిమాండ్‌కు సరిపడా చికెన్ అందడంలేదని తెలుస్తోంది. మున్ముందు ఎండలు మరింత పెరిగే అవకాశం ఉండటంతో ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు అంటున్నారు.
* చికెన్ ధరలు ఇలా..
ఉమ్మడి వరంగల్‌లో ప్రస్తుతం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. స్కిన్లెస్ చికెన్ రూ.380 – రూ.400,
లైవ్ కోడి రూ.220 – రూ.230, నాటు కోడి రూ.750 – రూ.800 పలుకుతోంది. వారం క్రితం స్కిన్లెస్ చికెన్ రూ.290 – రూ.350, లైవ్ కోడి రూ.175 – రూ.200, నాటు కోడి రూ.650 – రూ.700 ల మధ్య ఉంది.
* ఎగుమతులు లేక తగ్గిన గుడ్డు ధర
ఒక వైపు చికెన్ ధర పెరిగిపోతుండగా.. మరో వైపు గుడ్డు ధర పడిపోతోంది. నెల రోజుల క్రితం వరకు గుడ్ల కొరత కారణంగా రిటైల్‌గా ఒక్కో గుడ్డు రూ.7.50 నుంచి రూ.8 లకు విక్రయించారు. ప్రస్తుతం ఇరాన్-ఇజ్రాయిల్, అమెరికా యుద్ధం కారణంగా ఎగుమతులు తగ్గాయి. మార్కెట్లో గుడ్ల నిల్వలు పేరుకుపోతున్నాయి. ఉత్పత్తి ఉన్నా డిమాండ్ లేకపోవడంతో ప్రస్తుతం గుడ్డు ధర రూ.4.50 నుంచి రూ.6.50 వరకు విక్రయం జరుగుతోంది.
* సర్దుకుపోతున్నాం.. సామాన్యడి ఆవేదన
చికెన్ ధరలు ఆకాశాన్ని తాకుతుండటంతో సామాన్య మధ్యతరగతి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ముక్క లేనిదే ఆదివారం గడవని పరిస్థితి ఉన్నా, ఇప్పుడు కిలో ధర రూ. 400లకు చేరువ కావడంతో చికెన్ కొనాలంటేనే ఆలోచిస్తున్నారు. “గతంలో కిలో కొనేవాళ్లం, ఇప్పుడు అర కిలోతో సర్దుకుపోతున్నాం” అని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు గుడ్ల ధరలు తగ్గడం చికెన్ ప్రియులకు కాస్త ఊరటనిచ్చే అంశం. చికెన్ కొనలేకపోయినా, ప్రోటీన్ కోసం చాలామంది గుడ్ల వైపు మొగ్గు చూపుతున్నారు. అయినప్పటికీ, ముక్క కోసం తపించే సామాన్యుడికి ఈ ధరల పెరుగుదల ఒక తీరని లోటుగా మారింది.
