Junior Ball Badminton Championship
* 71వ రాష్ట్రస్థాయి జూనియర్ పోటీలు ఘనంగా ముగింపు..
* విజేతలకు బహుమతుల ప్రదానం
ఆకేరు న్యూస్, కమలాపూర్: హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబా ఫూలే బాలుర గురుకుల పాఠశాలలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న 71వ రాష్ట్రస్థాయి జూనియర్ బాల్ బ్యాడ్మింటన్ పోటీలు (State Level Junior Ball Badminton Championships) మంగళవారం ఘనంగా ముగిశాయి. ఈటెల మల్లయ్య – వెంకటమ్మ స్మారకార్థం నిర్వహించిన ఈ పోటీల్లో బాలుర, బాలికల విభాగాల్లో వరంగల్, మెదక్ జట్లు విజేతలుగా నిలిచి ఛాంపియన్షిప్ (Championship) కైవసం చేసుకున్నాయి.
బాలుర విభాగంలో వరంగల్ జట్టు ప్రథమ స్థానంలో నిలవగా, ఆదిలాబాద్ జట్టు ద్వితీయ స్థానం, కరీంనగర్ జట్టు తృతీయ స్థానాన్ని సాధించాయి. బాలికల విభాగంలో మెదక్ జట్టు విజేతగా నిలవగా, ఖమ్మం జట్టు రన్నరప్‌గా, వరంగల్ జట్టు మూడో స్థానాన్ని దక్కించుకుంది.
ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బాల్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (BBFI) అడ్వైజర్, ఆక్టోపస్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారులకు విద్య, ఉద్యోగాల్లో రావాల్సిన రిజర్వేషన్లు, ఫెడరేషన్ గుర్తింపు పునరుద్ధరణ కోసం తమ వంతు కృషి చేస్తున్నామని తెలిపారు. క్రీడాకారులకు 2 శాతం క్రీడా కోటాను (Sports Quota) పునరుద్ధరించాలని, 2026 ఫెడరేషన్ రెన్యూవల్ సమస్యను కేంద్ర స్థాయిలో త్వరితగతిన పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ, క్రీడాస్ఫూర్తితో లక్ష్య సాధన కోసం నిరంతరం కృషి చేయాలని క్రీడాకారులకు సూచించారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు.
ఖేలో ఇండియా యూత్ గేమ్స్ పోస్టర్ల ఆవిష్కరణ
తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించనున్న 8వ ఎడిషన్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ – తెలంగాణ 2026 (Khelo India Youth Games Telangana 2026)కు సంబంధించిన అధికారిక మస్కట్ ‘నీలమణి’ పోస్టర్లను ఈ సందర్భంగా ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడల అధికారి (DYSO) ప్రశాంత్ మాట్లాడుతూ.. గెలిచిన, ఓడిన క్రీడాకారులందరికీ అభినందనలు తెలిపారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఎంతో ప్రతిష్ఠాత్మకమైన క్రీడా కార్యక్రమమని, ఉమ్మడి వరంగల్ జిల్లాలో నిర్వహించనుండటం గర్వకారణమని అన్నారు. క్రీడాకారులందరూ ఈ పోటీలను సందర్శించి, దేశంలోని ప్రతిభావంతులైన క్రీడాకారుల ఆటతీరును పరిశీలించాలని, వారి నుంచి కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కమలాపూర్ మండల బాల్ బ్యాడ్మింటన్ కమిటీ అధ్యక్షుడు పబ్బు సతీష్, గూడూరు గ్రామ సర్పంచ్ బండి వనజ, ఎంజేపీ బాలుర పాఠశాల ప్రిన్సిపాల్ డాక్టర్ తాడూరి రవీందర్, బాల్ బ్యాడ్మింటన్ తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి వి.వి. రమణ, ఉపాధ్యక్షుడు దుర్గయ్య, కాంగ్రెస్ సీనియర్ నాయకులు బాలసాని రమేష్, బండి కళాధర్, దాతలు ఈటల సమ్మన్న, ఈటల భద్రన్న, ప్రొఫెసర్ ఎర్రగడ్డ స్వామి, బంగారు రాజయ్య, రిక్కల నారాయణరెడ్డి, చీఫ్ రిఫరీ రామకృష్ణారెడ్డి, రిఫరీలు, కోచ్‌లు, మేనేజర్లు, వ్యాయామ ఉపాధ్యాయులు, వివిధ జట్ల ప్రతినిధులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

