* క్యూనెట్ (QNet) భారీ కుంభకోణం బట్టబయలు
* ఐటీ ఉద్యోగులే టార్గెట్!
ఆకేరు న్యూస్, హైదరాబాద్: మల్టీ లెవల్ మార్కెటింగ్ (MLM) పేరుతో అమాయక ప్రజలను, ముఖ్యంగా యువతను నిలువునా ముంచుతున్న అంతర్జాతీయ నెట్వర్క్ ‘క్యూనెట్’ (QNet) పై హైదరాబాద్ సిటీ పోలీస్ సిట్ (SIT) అధికారులు ఉక్కుపాదం మోపారు. కొన్ని వందల కోట్ల రూపాయల మేర సాగుతున్న ఈ అక్రమ మనీ సర్క్యులేషన్ స్కామ్‌ను ఛేదించి, రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలో మొత్తం 32 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు సీనియర్ ఐపీఎస్ అధికారి వి.సి. సజ్జనార్ వెల్లడించారు.
మోసం సాగిందిలా:
విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ (QNet) పేరుతో నడుస్తున్న ఈ సంస్థ, తక్కువ కాలంలోనే కోటీశ్వరులు అయిపోవచ్చు అంటూ నమ్మబలికి మధ్యతరగతి కుటుంబాలను వేటాడింది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు, విద్యావంతులైన నిరుద్యోగులే లక్ష్యంగా ఈ మోసం సాగింది. భారీ రిటర్న్స్ వస్తాయని, విదేశీ ప్రయాణాలు చేయవచ్చని ఆశచూపి లక్షలాది రూపాయలను పెట్టుబడిగా పెట్టించుకున్నారు. వస్తువుల అమ్మకం కేవలం సాకు మాత్రమేనని, అసలు ఉద్దేశం కొత్త వ్యక్తులను చేర్పించి డబ్బులు వసూలు చేయడమేనని పోలీసుల విచారణలో తేలింది.
చట్టరీత్యా నేరం:
ప్రైజ్ చిట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ (నిషేధిత) చట్టం 1978 ప్రకారం ఇటువంటి పథకాలను ప్రచారం చేయడం లేదా వాటిలో సభ్యులుగా చేరడం తీవ్రమైన నేరం. ఇటువంటి “గెట్ రిచ్ క్విక్” (త్వరగా ధనవంతులు అవ్వండి) అనే ప్రకటనలు చేసే సంస్థలను నమ్మి ప్రజలు తమ కష్టార్జితాన్ని పోగొట్టుకోవద్దని సజ్జనార్ విజ్ఞప్తి చేశారు.
అప్రమత్తంగా ఉండండి:
“సైబర్ నేరాలు, ఆర్థిక మోసాల పట్ల ప్రజలు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. ఎవరైనా అధిక లాభాలు ఇస్తామని చెబితే దాని వెనుక ఉన్న వాస్తవాలను పరిశీలించాలి. మీ పరిసరాల్లో ఇలాంటి అక్రమ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ నడుస్తుంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించండి” అని ఆయన పేర్కొన్నారు. ఈ కేసులో మరింత లోతైన దర్యాప్తు కొనసాగుతోందని, మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు
