* ఆర్టీసీ బస్సును వెనుక నుంచి ఢీకొట్టిన కారు
* చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం
ఆకేరు న్యూస్, చిత్తూరు : వీకెండ్.. వారి జీవితానికి చివరి మజిలీగా మారింది. తిరుమల శ్రీవారి దర్శనం కోసం బయలుదేరిన ఒక కుటుంబం గమ్యస్థానానికి చేరుకోకముందే కాలగర్భంలో కలిసిపోయింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఒక భీకర రోడ్డు ప్రమాదం సంభవించింది. బంగారుపాళ్యం మండల పరిధిలోని శేషాపురం వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఒక కారు వేగంగా వచ్చి వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ధాటికి కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
వరంగల్ వాసులుగా గుర్తింపు..
మృతులను తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మృతుల్లో శ్రీధర్ రావు, ఆయన భార్య లక్ష్మి, వారి నాలుగేళ్ల చిన్నారి కుమార్తె అద్విక ఉన్నారు. వీరు గత కొంతకాలంగా బెంగళూరులో నివసిస్తున్నట్లు సమాచారం. వీకెండ్ సెలవు కావడంతో శనివారం ఉదయం శ్రీవారి దర్శనం చేసుకోవాలనే సంకల్పంతో బెంగళూరు నుండి కారులో బయలుదేరారు. అయితే, ప్రయాణం సగం దూరం దాటాక చిత్తూరు జిల్లా సరిహద్దుల్లో ఈ విషాదం చోటుచేసుకుంది.
ప్రమాదం జరిగిన తీరు… నుజ్జునుజ్జైన కారు…
పోలీసుల ప్రాథమిక దర్యాప్తు మరియు ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. పలమనేరు నుంచి చిత్తూరు వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ప్రయాణికులను దించుకోవడానికి శేషాపురం వద్ద సర్వీస్ రోడ్డు మార్గంలో ఆగింది. అదే సమయంలో వెనుక నుంచి అతివేగంగా వచ్చిన కారు, బస్సును గమనించలేక నేరుగా వెళ్లి బస్సు వెనుక భాగాన్ని ఢీకొట్టింది.
ప్రమాద తీవ్రత ఎంతలా ఉందంటే, కారు ముందు భాగం పూర్తిగా బస్సు కిందకు దూసుకెళ్లి ఇనుప ముక్కల్లా మారిపోయింది. కారులో ముందు సీటులో కూర్చున్న దంపతులతో పాటు చిన్నారి కూడా తీవ్ర గాయాలపాలై నిమిషాల్లోనే కన్నుమూశారు. ప్రమాదం జరిగిన సమయంలో కారును నడుపుతున్న డ్రైవర్ తీవ్రంగా గాయపడగా, స్థానికులు వెంటనే స్పందించి అతడిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
తండ్రి గుండెలపైనే కూతురు..
ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో హృదయ విదారకంగా దృశ్యం ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తోంది. కారు ప్రమాదంలో వరంగల్‌కు చెందిన ముగ్గురు మృతి చెందారు. ప్రమాద ఘటన సమయంలో కారులో ముందు సీట్లో తండ్రీ కూతురు, వెనుక సీట్లో భార్య కూర్చుని ఉన్నారు. కారు బస్సును ఢీకొట్టిన కుదుపులో కూతురు తండ్రి గుండెల పైకి వచ్చి చేరింది. అదే స్థితిలో మృతి చెంది ఉండడాన్ని చూసిన స్థానికుల హృదయాలు ద్రవించి పోయాయి.
