* గత రెండు పర్యాయాలకు భిన్నంగా ప్రభుత్వ ఏర్పాటు
* సంపూర్ణం కాదు.. సంకీర్ణం..
* మిత్రపక్షాల మద్దతుతోనే పీఠంపైకి..
* డిమాండ్లు లేకపోవడం ఊరటనిచ్చే అంశం
* మున్ముందూ మిత్రపక్షాలు ఇలాగే కొనసాగేనా?
* మరోవైపు పుంజుకున్న ప్రతిపక్షం
* రేపు సాయంత్రం మోదీ ప్రమాణస్వీకారం
ఆకేరు న్యూస్ డెస్క్ : అతిపెద్ద ప్రజాస్వామిక దేశం భారత ప్రధానమంత్రిగా.. నరేంద్ర దామోదర్ దాస్ మోదీ (Narendra Damodardas Modi) వరుసగా మూడోసారి రేపు సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎంతో అట్టహాసంగా మూడోసారి ప్రమాణస్వీకారం చేయనున్న మోదీ పాలన ఈసారి ఎలా కొనసాగుతుందోనన్న ఉత్కంఠ ఏర్పడింది. అందుకు కారణం.. ఈసారి ప్రభుత్వ ఏర్పాటుకు మిత్రపక్షాలపై ఆధారపడడమే.
రెండు పర్యాయాలూ సొంత బలమే..
అబ్ కీ బార్.. 400 పార్.. పేరుతో ప్రచారం సాగించిన నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) 293 స్థానాలకే పరిమితమైంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో లోక్ సభలోని 543 స్థానాలకు గానూ ఎన్డీఏ కూటమి 337 స్థానాలు పొందింది. బీజేపీ సొంతంగానే 281 స్థానాలు సాధించి చరిత్ర సృష్టించింది. ప్రభుత్వం ఏర్పాటు చేయగల సామర్థ్యాన్ని పొందింది. ఐదేళ్లపాలనా కాలంలో దేశ ప్రజలను మోదీ మరింత ఆకర్షించారు. ఫలితంగా 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో 303 స్థానాలు సాధించి సంచలనం సృష్టించారు. ఎన్డీఏ (NDA) కూటమిలోనే ఉన్నా.. ఈసారి కూడా సొంతంగానే ప్రభుత్వం ఏర్పాటు చేయగల బలం సంపాదించారు. దీంతో మిత్రపక్షాలపై ఆధారపడాల్సిన అవసరం బీజేపీకి రాలేదు. రాష్ట్ర ప్రయోజనాల రీత్యా మిత్రపక్షాలకే కేంద్ర ప్రభుత్వ అవసరం ఏర్పడింది.
ప్రచారంలో వినూత్న పంథా
2014, 2019 ఎన్నికల్లో సాధించిన ఫలితాల కంటే మరిన్ని స్థానాల్లో సత్తాచాటాలని బీజేపీ భావించింది. రెండో పర్యాయంలో తీసుకున్న సంచలన నిర్ణయాలు అందుకు కలిసి వస్తాయన్న ధీమాలో ఉంది. వాస్తవానాకి పదేళ్లు అధికారంలో ఉన్న పార్టీపై వ్యతిరేకత సహజమే అయినా.. దేశంలో మోదీ మ్యాజిక్ పనిచేస్తుందని కమలనాథులు భావించారు. దీనికి తోడు.. ఆర్టికల్ 370 రద్దు, అయోధ్య రామాలయ నిర్మాణం వంటి సంచలన కార్యక్రమాలు దోహదపడతాయని దీమాతో ఉన్నారు. అదే విశ్వాసంతో ‘అబ్ కీ బార్.. 400 పార్..’ పేరుతో ప్రచారం చేపట్టారు. ఇది ‘మోదీ గ్యారెంటీ’ అంటూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ సీట్లు పెరగలేదు. పైగా.. గతంతో పోలిస్తే తగ్గాయి. అంతేకాదు.. గుజరాత్ ముఖ్యమంత్రిగా, ప్రధానిగా మోదీ ఆధ్వర్యంలో బీజేపీ మేజిక్ మార్కును దాటకపోవడం ఇదే మొదటిసారని గణాంకాలు చెబుతున్నారు. సొంతంగా 270 సీట్లు సాధిస్తామన్న ఆ పార్టీ నేత అమిత్ షా ప్రచారానికి విరుద్ధంగా ఫలితాలు వెల్లడయ్యాయి.
వ్యక్తిగతంగానూ తగ్గిన ఇమేజ్..
జూన్ 4న వెల్లడైన లోక్ సభ ఫలితాల్లో అత్తెసరు మెజారిటీతోనే ఎన్డీయే మేజిక్ మార్కు 272ను దాటింది. 543 స్థానాలకు గాను 293 స్థానాలను గెలుచుకుని సంపూర్ణ మెజారిటీ పొందినా.. గత రెండు పర్యాయాలతో పోల్చుకుంటే తక్కువే. ఈసారి మోదీ మెజారిటీ కూడా బాగా తగ్గడం చర్చనీయాంశంగా మారింది. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి పార్లమెంట్ స్థానం నుంచి తన సమీప ప్రత్యర్థి అజయ్ రాయ్‌పై మోదీ 1,52,513 (13.5ు) ఓట్ల మెజారిటీ సాధించారు. తొలి రౌండులో మోదీ వెనుకంజలో ఉండడం గమనార్హం. ఆ తర్వాత పుంజుకున్నా.. గతంతో పోల్చుకుంటే మోదీ మెజారిటీ ఘోరంగా పడిపోయింది. 2014లో ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్‌పై 3,71,784 (35.14ు) ఓట్ల తేడాతో, 2019లో ఎస్పీ అభ్యర్థి షాలినీ యాదవ్‌పై 4,79,505 (45.2ు) ఓట్ల భారీ మెజారిటీతో గెలిచిన మోదీ ఈసారి కేవలం 1,52,513(13.5ు) ఓట్ల మెజారిటీ మాత్రమే సాధించడం గమనార్హం.
అందరి సహకారం అవసరం
కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు కనీసం 272 సీట్లు కావాలి. కానీ.. ఈ ఎన్నికల్లో బీజేపీకి సొంతంగా 240 సీట్లు మాత్రమే వచ్చాయి. సంపూర్ణం ప్రభుత్వానికి అవకాశం లేకపోవడంతో సంకీర్ణం తప్పనిసరిగా మారింది. అందుకు మిత్రపక్షాల అవసరం మోదీకి తప్పనిసరి. ఈనేపథ్యంలో చంద్రబాబునాయుడు (Chandrababu Naidu), నితీశ్‌కుమార్ (Nitish Kumar) కింగ్ మేకర్లుగా మారారు. శుక్రవారం జరిగిన ఎన్టీఏ పక్షాల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేశాన్ని నడిపించాలంటే అందరి సహకారం అవసరం అని, మిత్రపక్షాల మద్దతు తీసుకుంటామని చెప్పారు. పొత్తుకు ముందు వరకు అపాయింట్ కూడా ఇవ్వని చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తారు. అలాగే.. ఆయన మాటల్లో ఎక్కడా బీజేపీ ప్రభుత్వం అనే పేరు వినిపించలేదు. ఎన్డీఏ ప్రభుత్వం అన్న అంశాన్ని పదే పదే ప్రస్తావించారు. అందరి సహకారం తీసుకుంటామని తెలిపారు.
మోదీ.. 1/3 పీఎం మాత్రమే..
లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిని గద్దె దించాలనే లక్ష్యంతో ఏర్పాటైన ఇండియా కూటమి లక్ష్యాన్ని అయితే సాధించలేదుకానీ.. బీజేపీకి మెజార్టీ స్థానాలు రాకుండా అడ్డుకుంది. ఇండియా కూటమి 230 సీట్లు గెలుచుకుంది. అదే సమయంలో గత ఎన్నికల్లో కేవలం 44 సీట్లకే పరిమితమైన కాంగ్రెస్ ఈసారి సెంచరీకి చేరువైంది. దీంతో ఇండియా కొంత ఉత్సాహంగానే ఉంది. మరోవైపు బీజేపీకి సొంత బలం లేకపోవడంతో సరైన సమయంలో స్పందిస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే (Mallikarjun Kharge) ఫలితాలు వచ్చిన రోజున వ్యాఖ్యానించారు. అలాగే.. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ ఇకపై ఒకటిలో మూడో వంతు(1/3) ప్రధాని అని ఎద్దేవా చేశారు. జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్, తెలుగుదేశం చీఫ్ చంద్రబాబుతో కలిసి మోదీ 1/3 పీఎం అవుతారని అన్నారు. ఈక్రమంలో మోదీ కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. దీనిలో భాగంగానే విపక్షాల సమావేశంలో మోదీ తీరు మారిందని మేధావులు అంచనా వేస్తున్నారు. చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తడం దీనిలో భాగమేనని పేర్కొంటున్నారు. ఇకపై సమష్టిగానే నిర్ణయాలు ఉంటాయని చెప్పడం మరొకటి అని పేర్కొంటున్నారు. మరోవైపు మోదీ ముందు ఎటువంటి డిమాండ్లు పెట్టకుండా మిత్రపక్షాలు కూడా సానుకూలంగా ఉన్నాయి. అయితే.. మున్ముందూ ఇలాగే కొనసాగుతాయా? లేదా? అనేది చూడాలి.
—————————-