* ఆంధ్రప్రదేశ్‌లో ముగ్గురు
* తెలంగాణలో ఇద్దరు
* రెండో సారి కిషన్ రెడ్డికి అవకాశం
ఆకేరు న్యూస్ , హైదరాబాద్ : ఎన్డీఏ కేబినెట్లో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురికి అవకాశం దక్కింది. ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురికి, తెలంగాణ నుంచి ఇద్దరికి నరేంద్ర మోది మంత్రి వర్గంలో చోటు లభించింది. ఇటీవలి వరకు కేంద్ర మంత్రిగా పనిచేసిన కిషన్ రెడ్డికి మరో అవకాశం దక్కింది. రాష్ట్ర అధ్యక్షుడిగా బీజేపీ ని తెలంగాణలో నిర్ణయాత్మక శక్తిగా మలిచిన బండి సంజయ్‌కు కూడా మోది మంత్రి వర్గంలో అవకాశం వచ్చింది. ఎన్ డీఏ లో కీలక భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ నుంచి కూడా ఇద్దరికి అవకాశం దక్కింది. మూడో సారి ఎంపీగా గెలిచిన కింజారపు రామ్మోహన్ నాయుడు కేబినెట్ మంత్రిగా బాధ్యతలు చేపడుతున్నాడు. రామ్మోహన్ నాయుడు శక్తి వంతంగా తన వాణిని లోక్ సభలో వినిపించారు. ఇక దేశంలోనే అత్యధిక సంపన్న ఎంపీగా పేరున్న గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్‌తో పాటు బీజేపీకి చెందిన నరసాపురం ఎంపీ శ్రీనివాసవర్మకు మంత్రి వర్గంలో స్థానం లభించింది.
కిషన్ రెడ్డికి మరో సారి అవకాశం
నరేంద్ర మోది కెబినెట్లో మంత్రిగా గంగాపురం కిషన్ రెడ్డికి మరో సారి అవకాశం దక్కింది. కిషన్ రెడ్డి రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపురం గ్రామంలో స్వామి రెడ్డి, అండాళమ్మ దంపతులకు జన్మించారు. రెండో సారి ఎంపీగా గెలిచిన కిషన్ రెడ్డి విద్యార్థి దశ నుంచే బీజేపీ రాజకీయాల్లో ఉన్నారు. ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తగా బీజేపీ నాయకుడిగా అంచలంచెలుగా ఎదిగారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. కిషన్ రెడ్డి కి సౌమ్యుడిగా ప్రజల్లో మంచి పేరున్నది. నరేంద్ర మోది గత కేబినెట్లో సహాయ మంత్రిగా , కేబినెట్ మంత్రిగా పనిచేశారు.
* కార్పోరేటర్ నుంచి కేంద్ర మంత్రి వరకు..
కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ బీజేపీతో సుధీర్ఘ రాజకీయ బంధం ఉంది. ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తగా మొదలైన ప్రస్థానం కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగింది. కరీంనగర్ పట్టణానికి చెందిన బండి నర్సయ్య, శకుంతల దంపతులకు 11 జూలై 1971లో జన్మించారు. బీజేపీ లో కార్యకర్తగా మొదలై జాతీయ నాయకుడిగా ఎదిగాడు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టి పార్టీ ని ఉన్నత స్థాయిలో నిలబెట్టే ప్రయత్నం చేశారు. పార్టీ పదవులతో పాటు ప్రజా ప్రతినిధిగా ఆయన ప్రస్థానం కార్పోరేటర్‌గా మొదలైంది. కరీంనగర్ అర్బన్ బ్యాంకు డైరెక్టర్‌గా రెండు పర్యాయాలు పనిచేశారు. కరీంనగర్ ఎమ్మెల్యేగా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. రెండు సార్లు ఎంపీగా గెలిచారు. ఇప్పడు కేంద్ర మంత్రిగా నరేంద్ర మోది కేబినెట్లో పనిచేసే అవకాశం దక్కింది.
* తండ్రి బాటలో తనయుడు..
కింజారపు రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ గ్రామంలో విజయలక్ష్మి , ఎర్రన్నాయుడు దంపతులకు 1987 డిసెంబరు 18 న జన్మించారు. శ్రీకాకుళం, హైదరాబాద్ , ఢిల్లీ , అమెరికాలో విద్యాభ్యాసం చేశారు. తండ్రి ఎర్రన్నాయుడు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు. కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఎర్రన్నాయుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో చిన్న వయసులోనే రామ్మెహన్ నాయుడు రాజకీయ రంగ ప్రవేశం చేయాల్సి వచ్చింది. మూడో సారి ఎంపీగా గెలిచారు. తెలుగుతో పాటు రామ్మోహన్ నాయుడు ఇంగ్లీష్, హిందీ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలుగుతాడు. ఆంధ్రప్రదేశ్ సంబందించిన అనేక అంశాలను లోక్ సభలో ప్రస్తావించి మెప్పు పొందాడు.
* అరంగేట్రమే అదిరేట్టు.
పెమ్మసాని చంద్రశేఖర్ మొదటి సారి ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రిగా అవకాశం దక్కించుకున్నాడు. గుంటూరు జిల్లా బుర్రిపాలెంకు చెందిన పెమ్మసాని సాంబశివరావు సువర్ణ దంపతులకు 1976 మార్చి 7న జన్మించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంబీబీఎస్ చదివాడు. అనంతరి పీజీ అమెరికాలో చదివారు. అమెరికాలోని జాన్ యూనివర్సిటీలో టీచింగ్ ఫ్యాకల్టీ కొనసాగాడు. అక్కడి పోటీ పరీక్షల కోసం ఆన్ లైన్లో నోట్స్ , గైడెన్స్ అందించే వాడు. విద్యార్థు నుంచి ఈ నోట్స్‌కు విపరీతమైన డిమాండ్ వచ్చింది. విద్యార్థులకు ఉపయోగపడేందుకు యూ వరల్డ్ అనే ట్రైనింగ్ సంస్థను ప్రారంభించారు, అమెరికాలో డిమాండ్ ఉన్న అన్ని రకాల పోటీ పరీక్షలకు శిక్షణ ఇవ్వడం ద్వారా బాగా పేరు, డబ్బు సంపాదించారు. తన జన్మభూమి కోసం సేవ చేసేందుకు ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి అనేక రూపాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఎన్నికలకు కొద్ది నెలల ముందు చంద్రశేఖర్ తెలుగుదేశంలో చేరారు. గుంటూరు నుంచి పోటీ చేసి ఎంపీగా విజయం సాధించారు.
విధేయతకు పట్టం
బీజేపీ వర్మగా పేరున్న భూపతి రాజు శ్రీనివాస వర్మకు అనూహ్యంగా ఎంపీగా అవకాశమే కాదు, మంత్రి పదవి కూడా దక్కింది. కమ్యూనిస్టు పార్టీ అనుబంధ విద్యార్థి విభాగంలో పనిచేశారు. శ్రీనివాసవర్మ కాలక్రమంలో బీజేపీలో చేరి అంచెలంచలుగా ఎదిగారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన సూర్యనారాయణ రాజు, సీతాలక్ష్మి దంపతులకు 1967 ఆగస్టు 4న జన్మించారు.
——————————————————-