RTC Bus strike Telangana government
*సమ్మె విరమించి ప్రజలకు అండగా నిలవండి
* విద్యార్థి నాయకుడిగా కార్మికులకు ఎప్పుడూ అండగా ఉంటా..
రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
ఆకేరు న్యూస్, కమలాపూర్:
టీజీఎస్ఆర్టీసీ సంస్థ పరిరక్షణ, ప్రజా శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని సమ్మెను విరమించాలని ఆర్టీసీ సోదరులకు, వారి కుటుంబ సభ్యులకు మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. సమ్మె సమస్యకు పరిష్కారం కాదని, చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయని పేర్కొన్నారు. కార్మికుల సమస్యలను అధ్యయనం చేసి పరిష్కరించేందుకు ఉన్నత స్థాయి అధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశామని,కమిటీల పేరు తో కాలయాపన చేస్తామనడం పొరపాటు అని, ఈ కమిటీ నాలుగు వారాల్లో నివేదిక అందజేస్తుందని మంత్రి పొన్నం వివరించారు. ఆర్టీసీ కార్మికులు లేవనెత్తిన 32 అంశాల్లో 29 అంశాల పట్ల ప్రభుత్వానికి ఎలాంటి వ్యతిరేకత లేదని, అవి తక్షణమే పరిష్కారమయ్యేవేనని, ఇక విలీనం, గుర్తింపు సంఘాల ఎన్నికల వంటి పెండింగ్ అంశాల్లోని సాంకేతిక చిక్కులను పరిశీలించేందుకు గడువు అవసరమని, వీటిపై ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితో చర్చిస్తామని కమిటీకి ఇప్పటికే తెలియజేశారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి పెండింగ్ పీఆర్సీ, డీఏలు, బాండ్ల క్లియరెన్స్‌తో పాటు భారీగా పేరుకుపోయిన పీఎఫ్, సిసిఎస్ బకాయిలను తగ్గించామని, నెలవారీ చెల్లింపులను క్రమం తప్పకుండా చేస్తున్నామని ఆయన గుర్తు చేశారు. ఉద్యోగుల పని భారాన్ని తగ్గించేందుకు 4,538 ఉద్యోగాల నియామకం, 1134 కారుణ్య నియామకాలు, గతంలో విధుల నుంచి తొలగించబడిన సుమారు 250 మందికి తిరిగి ఉద్యోగ అవకాశాలు కల్పించడం వంటి చర్యలు చేపట్టామని వివరించారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆర్టీసీని ఇబ్బందుల్లోకి నెట్టవద్దని, మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు వ్యవహరించవద్దని మంత్రి కోరారు. ఆర్టీసీ ద్వారా రోజుకు 65 లక్షల మంది ప్రయాణిస్తుండగా, వారిలో 45 లక్షల మంది మహిళలే ఉన్నారని, ఉపాధి, విద్య, వైద్యం కోసం ఆర్టీసీపై ఆధారపడే పేద ప్రజలను దృష్టిలో ఉంచుకుని కార్మికులు నిర్ణయం తీసుకోవాలని మంత్రి పొన్నం కోరారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపే హక్కు నాయకులకు ఉందని, అయితే పేద ప్రజల ప్రయాణాలకు ఇబ్బందులు కలిగించేలా సమ్మె చేయవద్దని విజ్ఞప్తి చేశారు. విద్యార్థి నాయకుడిగా కార్మికులకు ఎప్పుడూ అండగా ఉంటానని మంత్రి పొన్నం ప్రభాకర్ భరోసా ఇస్తూ, ఆర్టీసీ కార్మికులను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామని, ప్రజలకు అసౌకర్యం కలగకుండా విధుల్లో చేరి సంస్థను, ప్రజలను కాపాడాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సామాజిక వేదికగా ఎక్స్ లో కోరారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
