Telangana summer holidays schools
* రేపటి నుంచే స్కూళ్లకు వేసవి సెలవులు
* విద్యాశాఖ అధికారిక ప్రకటన
ఆకేరు న్యూస్, డెస్క్: తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థులకు విద్యాశాఖ తీపి కబురు అందించింది. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలలకు రేపటి నుంచి (ఏప్రిల్ 24) వేసవి సెలవులు ఇస్తున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ సెలవులు జూన్ 11 వరకు కొనసాగుతాయని, జూన్ 12వ తేదీన పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయని స్పష్టం చేసింది.
* భద్రతా చర్యలపై ప్రత్యేక దృష్టి
సెలవుల నేపథ్యంలో విద్యార్థుల భద్రతపై పాఠశాల విద్యాశాఖ కొన్ని కీలక సూచనలు చేసింది. విద్యా సంవత్సరం చివరి రోజైన నేడు, అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు భద్రతా చర్యలపై అవగాహన సదస్సులు నిర్వహించాలని ప్రధానోపాధ్యాయులను ఆదేశించింది. ముఖ్యంగా ఎండ తీవ్రత దృష్ట్యా పిల్లలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని పేర్కొంది.
తల్లిదండ్రులకు, విద్యార్థులకు
విద్యాశాఖ సూచనలు: మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యార్థులు ఎండలో బయట తిరగకుండా చూడాలి. పాఠశాల ఆవరణలో మరియు నోటీసు బోర్డులపై భద్రతా నియమాలను స్పష్టంగా ప్రదర్శించాలి. సెలవుల్లో పిల్లలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని, వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులను అప్రమత్తం చేయాలని ఆదేశాల్లో పేర్కొంది.
రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండిపోతున్న తరుణంలో, విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని విద్యాశాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభం అయ్యే నాటికి విద్యార్థులు నూతన ఉత్సాహంతో తిరిగి రావాలని విద్యాశాఖ అధికారులు ఆకాంక్షించారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
