Domestic violence over clothing
* ఆమె పరిస్థితి విషమం
ఆకేరు న్యూస్ ఖానాపూర్ (బెళగావి): మనుషుల మధ్య పెరిగిపోతున్న అసహనం ప్రాణాల మీదకు తెస్తోంది. కట్టుకున్న భార్య వేసుకున్న దుస్తులు నచ్చలేదన్న చిన్న కారణంతో, ఓ భర్త ఆమెను సజీవ దహనం చేసేందుకు ప్రయత్నించిన అమానుష ఘటన కర్ణాటకలోని బెళగావి జిల్లాలో వెలుగుచూసింది.
* వీరిద్దరి మధ్య ఘర్షణలు*
బెళగావి జిల్లా ఖానాపూర్ తాలూకా నంద్రడ్ గ్రామానికి చెందిన కృష్ణ పాటిల్ (29), మంజులా పాటిల్ (27) దంపతులు. గత కొంతకాలంగా వీరి మధ్య చిన్న చిన్న విషయాల్లో ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో, ఇంట్లో మంజుల చీరకు బదులుగా నైటీ ధరించడంపై కృష్ణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు.
నైటీ తీసేసి వెంటనే చీర కట్టుకోవాలని, లేదంటే నైటీతో సహా నిన్ను కూడా తగలబెడతానని కృష్ణ ఆమెను హెచ్చరించాడు. అయితే, “ఇంట్లో ఉన్నప్పుడు నైటీ ధరిస్తే తప్పేంటి?” అని మంజుల అతడిని ఎదురు ప్రశ్నించింది. దీంతో ఆగ్రహం కట్టలు తెంచుకున్న కృష్ణ, క్షణికావేశంలో ఇంట్లో ఉన్న పెట్రోల్ తీసుకొచ్చి ఆమెపై పోసి నిప్పంటించాడు.
* 80 శాతం కాలిన గాయాలతో ఆర్తనాదాలు*
స్థానికులు వెంటనే ఆమెను రక్షించి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. శరీరంలో సుమారు 80 శాతం మేర కాలిన గాయాలవ్వడంతో ఆమె మృత్యువుతో పోరాడుతోంది.
* కృష్ణ పాటిల్ పై కేసు నమోదు*
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నిందితుడు కృష్ణ పాటిల్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కేవలం దుస్తుల విషయంలో తలెత్తిన గొడవ ఇంతటి దారుణానికి దారితీయడం స్థానికంగా కలకలం రేపింది.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
