CPM support RTC strike
ఆకీరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన సమ్మెకు సీపీఐ (ఎం) చిల్పూర్ మండల కమిటీ మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా జనగామ జిల్లా చిల్పూర్ మండల కేంద్రంలో గురువారం జరిగిన సమావేశంలో మండల కార్యదర్శి సాదం రమేష్ మాట్లాడుతూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం, ఉద్యోగాల భర్తీ, కార్మికుల బకాయిల చెల్లింపు, కార్మిక సంఘం ఎన్నికలు, ఔట్సోర్సింగ్ కార్మికుల రెగ్యులరైజ్ తదితర 32 డిమాండ్ల పరిష్కారం కోసం ప్రభుత్వం వేసిన ఐఏఎన్ అధికారుల కమిటీ 4 వారాల గడువు కోరడం సమ్మెను నీరుగార్చడమే అన్నారు. ప్రభుత్వం తక్షణమే జేఏసీ నాయకులతో చర్చలు జరిపి, ఆర్టీసీ కార్మికులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల హామీ మేరకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి, కార్మికులను ప్రభుత్వ ఉ ద్యోగులుగా గుర్తించి, వారికి ఉద్యోగ భద్రత కల్పించాలి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ వథకం ద్వారా రావలసిన సుమారు రు. 400 కోట్లతో పాటు, ఇతర బకాయిలను వెంటనే చెల్లించి, సంస్థను ఆర్థిక సంక్షోభం నుండి గట్టెక్కించాలి. అద్దె బస్సుల ముసుగులో సంస్థను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు ఎలక్ట్రిసిటీ బస్సులు ప్రైవేటు వ్యక్తుల ద్వారా కొనుగోలు చేసి నడువుతున్నది. ప్రభుత్వమే నేరుగా ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేసి, వాటిని సంపూర్ణంగా ఆర్టీనీ సంస్థకే అప్పగించాలి. ఏళ్ల తరబడి కనీస వేతనాలు, సౌకర్యాలు లేకుండా శ్రమ దోపిడీకి గురవుతున్న అవుట్ సోర్సింగ్ కార్మికులను తక్షణమే రెగ్యులరైజ్ చేయాలి. ఖాళీగా ఉన్న డ్రైవర్, కండక్టర్ నియామకాలను వెంటనే చేపట్టి కార్మికులపై ఉన్న అదనవు పని భారాన్ని తగ్గించాలి. గుర్తింపు సంఘం ఎన్నికలను జరపకపోవడం అంటే వారి హక్కులను కాలరాస్తూ, కార్మికుల గొంతు నొక్కడమే అన్నారు. సమ్మె కారణంగా నేడు రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. 39 వేల మంది కార్మికులు రోడ్డున పడేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ప్రయాణికుల మరియు ఆర్టీసీ కార్మికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కార్మికుల డిమాండ్లను సానుకూలంగా పరిష్కరించి సమ్మె విరమింపజేయాలని సాదం రమేష్ డిమాండ్ చేశారు.
