RTC STRIKE NARSAMPET BUS DRIVER SHANKAR GOUD
* హైదరాబాద్‌కు తరలిస్తుండగా మృతి
ఆకేరు న్యూస్, వరంగల్ : ఆర్టీసీ సమ్మె ఒక్కసారిగా వేడెక్కింది. నర్సంపేట డిపో ఆర్టీసీ డ్రైవర్ కోల శంకర్ గౌడ్ (55 ) గురువారం మద్యాహ్నం పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు. కార్మికులు, ప్రయాణికుల మద్యలోనే ఈ సంఘటన జరగడంతో ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. హుటా హుటిన వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున ఎంజీఎం ఆస్పత్రికి తరలి వచ్చారు. జిల్లా కలెక్టర్ సత్య శారద, పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఎంజీఎంకు చేరుకున్నారు. చికిత్స పొందుతున్న శంకర్ గౌడ్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. కాగా శంకర్ గౌడ్ 80 శాతం వరకు కాలినట్లు వైద్యులు చెబుతున్నారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం శంకర్ గౌడ్ ను హైదరాబాద్క తరలించారు.. చికిత్స ప్రారంభించక ముందే శంకర్ గౌడ్ తుది శ్వాస విడిచినట్లు కార్మిక నాయకులు చెప్పారు.. దీంతో పెద్ద ఎత్తున ఆర్టీసీ కార్మికులు హైదరాబాద్ కు చేరుకుంటున్నారు. బీఆర్ ఎస్ నాయకులు కూడా శంకర్ గౌడ్ మృత దేహం ఉన్న ఆస్పత్రికి తరలి వెళుతున్నారు. శాంతి భద్రతల పరిస్థితి తలెత్తకుండా పోలీసులు పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు.
* ప్రశ్నించే నైజం
నర్సంపేట పట్టణంలోని సాయి నగర్ కు చెందిన కోల శంకర్ గౌడ్ (55) ఆర్టీసీలో డ్రైవర్ గా 21 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నాడు. శంకర్ గౌడ్‌కు భార్య కూతురు కుమారుడు ఉన్నారు.
మొదటినుంచి ప్రశ్నించే తత్వం కలిగిన శంకర్ గౌడ్ గతంలో ఒకసారి సస్పెండ్ కు గురై ఇటీవలనే విధుల్లో చేరినట్లుగా తెలుస్తోంది. సమ్మె జరుగుతున్న సమయంలో ఓ ప్రైవేట్ డ్రైవర్ విధుల్లోకి చేరడంపై అతనితో వాగ్వాదం చేసి అడ్డుకునేందుకు ప్రయత్నం చేసినట్లుగా కార్మికులు చెబుతున్నారు. దీంతో ఆ డ్రైవర్ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు కార్మికులు చెబుతున్నారు.
* ఆత్మహత్యాయత్నాల పరంపర
డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్యాయత్నం తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మరో ఇద్దరు డ్రైవర్లు కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడినారు. భద్రాచలం డిపోకు చెందిన లింగారెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అదే విదంగా నల్గొండ డిపోకు చెందిన మరో కార్మికుడు కూడా పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సకాలంలో కార్మికులు ఆయన నిప్పు అంటు పెట్టుకోకుండా కాపాడగలిగారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఆర్టీసీ జేఏసీ డిమాండ్ చేస్తోంది.
——————–
