Rangareddy crane accident workers death
* ఐదుగురు కార్మికులు మృ*తి
ఆకేరు న్యూస్ రంగారెడ్డి :
రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండల పరిధిలో గుండెలవిసే విషాదం చోటుచేసుకుంది. మండలంలోని మహాలింగాపురం గ్రామ శివార్లలో ఉన్న ఒక సిమెంట్ ఇటుకల (Cement Bricks) తయారీ పరిశ్రమలో జరిగిన ఘోర ప్రమాదం ఐదుగురి కార్మికుల ప్రాణాలను బలితీసుకుంది. పనిలో నిమగ్నమై ఉన్న సమయంలో క్రేన్ ఒక్కసారిగా కుప్పకూలడంతో ఈ దుర్ఘటన సంభవించింది.
*ముడిసరుకును తరలించే క్రమంలో ఈ ప్రమాదం
మహాలింగాపురంలోని సదరు సిమెంట్ బ్రిక్స్ తయారీ కంపెనీలో మంగళవారం ఉదయం కార్మికులు యధావిధిగా విధులకు హాజరయ్యారు. భారీ ఇటుకలను, ముడిసరుకును తరలించే క్రమంలో క్రేన్‌ను ఉపయోగిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో క్రేన్ పరిసరాల్లో సుమారు 12 మంది కార్మికులు పని చేస్తున్నారు.అకస్మాత్తుగా క్రేన్ యొక్క ప్రధాన భాగం భారీ శబ్దంతో కార్మికులపై విరిగిపడింది. ఈ ఊహించని పరిణామానికి కార్మికులు అప్రమత్తమై ప్రాణాలు కాపాడుకునే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇనుప శిథిలాల కింద నలిగి 5 గురు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు మరో ఇద్దరు అస్పత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు .
*ఐదుగురు మృతి, ఇద్దరి పరిస్థితి విషమం
ప్రమాదం జరిగిన వెంటనే కంపెనీ ప్రాంగణం ఆర్తనాదాలతో దద్దరిల్లింది. భారీ క్రేన్ కింద చిక్కుకున్న కార్మికులను బయటకు తీసేందుకు తోటి సిబ్బంది శ్రమించారు. ఈ ఘటనలో బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన వలస కూలీలుగా పోలీసులు గుర్తించారు. మృతుల్లో అలీ హుస్సేన్ (35), నాగేంద్ర (30), సాజిద్ (32), మిథున్, సోను ఉన్నారు. మరో నలుగురు కార్మికులకు తీవ్ర గాయాలవ్వగా, మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులందరినీ వెంటనే అంబులెన్స్‌లో స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
*యజమాన్యం నిర్లక్ష్యమే కారణమా?
ఈ ప్రమాద వార్త తెలియగానే శంకర్ పల్లి పోలీసులు వేగంగా స్పందించి ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. క్రేన్ యొక్క ఫిట్నెస్ సరిగ్గా లేకపోవడం లేదా సామర్థ్యానికి మించి బరువును ఎత్తడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.
*పోలీసులు విచారణ
పరిశ్రమలో కార్మికులకు కనీస భద్రతా ప్రమాణాలు (Safety Measures) పాటించలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.క్రేన్ యంత్రాంగానికి కాలానుగుణంగా నిర్వహణ పనులు చేస్తున్నారా లేదా అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు.సదరు కంపెనీ నిర్వహణకు సంబంధించి అన్ని రకాల ప్రభుత్వ అనుమతులు ఉన్నాయా అన్నది కూడా పరిశీలిస్తున్నారు.
*కన్నీరుమున్నీరవుతున్న కుటుంబ సభ్యులు
పొట్టకూటి కోసం వచ్చి ప్రాణాలు కోల్పోయిన కార్మికుల వివరాలను సేకరించిన పోలీసులు మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని గుండెలవిసేలా రోదిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని, ప్రమాదానికి కారణమైన యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
