belt shops regulations kamalapur
*అక్రమ మద్యం విక్రయాలపై ఉప్పల్ పాలకవర్గం సీరియస్
ఆకేరు న్యూస్, కమలాపూర్:
కమలాపూర్ మండలంలోని ఉప్పల్ గ్రామ పంచాయతీ పాలకవర్గం గ్రామస్తుల ఆరోగ్యం దృష్ట్యా గ్రామంలోనీ బెల్ట్ షాపులపై గత నెల 20న బెల్ట్ షాపులను అరికట్టాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. కాగా నేడు ఉప్పల్ లో ప్రభుత్వం అనుమతించిన వైన్ షాపులో మాత్రమే విక్రయాలు జరగాలని, దొడ్డిదారిన బెల్టు షాపులకు కానీ, మరే ఇతర షాపులకు మద్యం అమ్మవద్దని హెచ్చరించారు. ఒకవేళ అమ్మినట్లయితే అక్రమ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకోవడంతో పాటు వారిపై చట్టపరమైన కేసులు నమోదు చేస్తామని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరంగా చర్యలు తప్పవని సర్పంచ్ రమ-నాగరాజు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎటువంటి సమయపాలన లేకుండా విచ్చలవిడిగా సాగుతున్న ఈ బెల్ట్ షాపుల దందా గ్రామ వాతావరణాన్ని పాడు చేస్తోందని, దీనికి వీలైనంత త్వరగా స్వస్తి పలకాలని పాలకవర్గం స్పష్టం చేశారు.
*కమలాపూర్‌లో బెల్ట్ షాపులకి గడువు
కాగా కమలాపూర్ లో సైతం బెల్ట్ షాపులకి ఈనెల 14 వరకు గడువు ఇచ్చారు.15వ తేదీ నుంచి బెల్డు షాపుల్లో మద్యం అమ్మినట్లయితే , పదివేల జరిమానా విధించబడుతుందని, పట్టించిన వారికి 2000 రూపాయల బహుమతి ఇస్తామనే విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది .
బెల్ట్ షాపుల నిషేధం అనేది కేవలం గ్రామ పంచాయతీ లు తీసుకునే నిర్ణయం మాత్రమే కాదు, అది సమాజంలో రావాల్సిన మార్పు. ప్రజల్లో చైతన్యం పెరిగినప్పుడు, స్వచ్ఛంద, పౌర సంఘాలు చురుగ్గా పర్యవేక్షించినప్పుడు మాత్రమే ఈ వ్యవస్థను పూర్తిగా నిర్మూలించగలం.
