self enumeration census 2027 awareness rally collector satya sharada
ఆకేరు న్యూస్ వరంగల్ : దేశాభివృద్ధికి దిక్సూచిగా నిలిచే ‘జనగణన-2027’ ప్రక్రియపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు వరంగల్ జిల్లా యంత్రాంగం శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా ఈసారి ప్రవేశపెట్టిన ‘సెల్ఫ్ ఎన్యుమరేషన్’ (స్వయం గణన) విధానంపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలనే లక్ష్యంతో శనివారం నగరంలో భారీ ప్రదర్శన నిర్వహించారు.
* ఐఎంఈ హాల్ నుండి పోచమ్మ మైదాన్ వరకు
నగరంలోని ఐఎంఈ (IME) హాల్ వద్ద ఈ అవగాహన ర్యాలీ ఘనంగా ప్రారంభమైంది. కుడా ఛైర్మన్ ఇనుగాల వెంకట్రామ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, మరియు అదనపు కలెక్టర్ జి. సంధ్య రాణి జెండా ఊపి ఈ ప్రదర్శనను ప్రారంభించారు. ర్యాలీ ఐఎంఈ హాల్ నుండి పోచమ్మ మైదాన్ సెంటర్ వరకు ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది.
* సెల్ఫ్ ఎన్యుమరేషన్’ను వినియోగించుకోండి
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ, మారుతున్న కాలానికి అనుగుణంగా జనగణన ప్రక్రియలో సాంకేతికతను జోడించినట్లు తెలిపారు. ప్రజలు తమ వివరాలను తామే ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకునే ‘సెల్ఫ్ ఎన్యుమరేషన్’ పద్ధతి అత్యంత సులభతరమైనదని, దీనివల్ల సమయం ఆదా అవ్వడమే కాకుండా తప్పులు లేని సమాచారం నమోదవుతుందని ఆమె పేర్కొన్నారు. కుడా ఛైర్మన్ ఇనుగాల వెంకట్రామ్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం చేపట్టే ప్రతి సంక్షేమ పథకం మరియు అభివృద్ధి కార్యక్రమం జనగణన గణాంకాల ఆధారంగానే రూపొందించబడుతుందని, కాబట్టి ప్రతి కుటుంబం తమ వివరాలను బాధ్యతగా నమోదు చేయించుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ జి. సంధ్య రాణి వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు రెవెన్యూ మరియు మున్సిపల్ సిబ్బంది, ప్రతినిధులు, అధికారులు మరియు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు “జనగణనలో భాగస్వాములు అవుదాం – దేశాభివృద్ధికి తోడ్పడుదాం” అంటూ నినాదాలు చేశారు. చేతుల్లో ప్లకార్డులు పట్టుకుని వీధుల్లో సాగిన ఈ ర్యాలీ ప్రజల దృష్టిని ఆకర్షించింది

Please tell us what is wrong. Your report will be sent to the website team.
