Suvendu Adhikari West Bengal cm
* నాడు కుడి భుజం- నేడు ప్రధాన ప్రత్యర్థి
ఆకేరు న్యూస్, ప్రత్యేక ప్రతినిధి: పశ్చిమ బెంగాల్ నూతన సీఎం గా రేపు సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఒకప్పుడు మమతా బెనర్జీకి కుడిభుజంగా ఉన్న సువేందు అధికారి, ఇప్పుడు అదే రాష్ట్రాన్ని పాలించే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించబోతున్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘనవిజయం సాధించడంతో బీజేపీ అధిస్ఠానం ఆదేశాల మేరకు శాసన సభా పక్షం సువేందు అధికారిని ఎన్నుకున్నారు.
* నేడు ప్రమాణ స్వీకారం
సువేందు అధికారి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా రేపు కలకత్తాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకు అవసరమైన భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సువేందు అధికారి 1970, డిసెంబర్ 15న పశ్చిమ బెంగాల్‌లోని పూర్బ మేదినీపూర్ జిల్లా, కార్కులిలో జన్మించారు.
ఆయన తండ్రి శిశిర్ అధికారి మాజీ కేంద్ర మంత్రి. సువేందు సోదరులు దిబ్యేందు మరియు సౌమేందు కూడా రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు. కోల్‌కతాలోని రవీంద్ర భారతి విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ (M.A.) హ్యుబమన్ రిసోర్స్ మేనేజి మెంట్లో పట్టా పొందారు.
కాగా మమతా బెనర్జీ లాగనే సువేందు అవివాహితుడు.
* నాడు అన్నీ తానై ..
ఒకప్పుడు అన్నీ తానై మమతా బెనర్జీకీ అండగా నిలిచిన సువేందు అధికారి ఇపుడు ప్రధాన ప్రత్యర్థికి మారి పోయాడు. ఏకంగా మమతా బెనర్జీ 15 ఏండ్ల పాటు పాలించిన పీఠాన్ని సువేందు స్వాధీనం చేసుకున్నారు.. సువేందు రాజకీయ జీవితం కాంగ్రెస్‌తో మొదలైంది, ఆయన ఎదుగుదల మాత్రం తృణమూల్ కాంగ్రెస్ (TMC) ద్వారా జరిగింది. 2007లో నందిగ్రామ్‌లో భూసేకరణకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో సువేందు కీలక పాత్ర పోషించారు. మమతా బెనర్జీ ముఖ్యమంత్రి కావడంలో ఈ ఉద్యమం పునాదిగా నిలిచింది. 2006లో ఎమ్మెల్యేగా, 2009 మరియు 2014లో లోక్‌సభ సభ్యుడిగా గెలిచారు. రాష్ట్ర కేబినెట్లో రవాణా మరియు సాగునీటి శాఖ మంత్రిగా పనిచేశారు.2021 ఎన్నికలలో నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి స్వయంగా మమతా బెనర్జీపై విజయం సాధించి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. 2026 ఎన్నికలలో మమత సొంత గడ్డ భవానీపూర్ నుండి కూడా ఆమెను ఓడించి తన బలాన్ని నిరూపించుకున్నారు.
* తన ప్రాధాన్యత తగ్గిందని ..
సువేందు అధికారి 2020 డిసెంబర్లో TMC పార్టీని వీడారు. దీని వెనుక ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి. మమతా బెనర్జీ తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీని పార్టీలో నంబర్-2గా మార్చడం, పార్టీ పగ్గాలు ఆయనకు అప్పగించడాన్ని సువేందు వ్యతిరేకించారు. క్షేత్రస్థాయిలో కష్టపడిన నాయకులకు కాకుండా, కొత్తగా వచ్చిన వారికే ప్రాముఖ్యత ఇస్తున్నారనే అసంతృప్తితో ఆయన పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. కాగా శారదా గ్రూప్ నిర్వహించిన మల్టీ కోటి రూపాయల కుంభకోణంలో సువేందు పేరు ప్రస్తావనకు వచ్చింది. తృణమూల్ ఎంపీ కునాల్ ఘోష్ అప్పట్లో ఈ కేసులో సువేందు ప్రమేయం ఉందని ఆరోపించారు. ఒక స్టింగ్ ఆపరేషన్‌లో సువేందు నగదు తీసుకుంటున్నట్లు కెమెరాకు దొరికిపోయారని ఆరోపణలు వచ్చాయి. అయితే, ఈ కేసులన్నీ రాజకీయ ప్రేరేపితమని ఆయన కొట్టిపారేస్తూ వచ్చారు. ఇపుడు ఏకంగా బెంగాల్ పై తన దైన పాలనను అందించేందుకు రంగం సిద్దం చేసుకున్నాడు..
====================================
