Bandi Sanjay POCSO Case
*చట్టం ఎవరికీ చుట్టం కాదు..
*బండి సంజయ్ తనయుడిపై పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో పోక్సో (POCSO) కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై నమోదైన కేసు విషయంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఘాటుగా స్పందించారు. గాంధీ భవన్లో మీడియాతో చిట్‌చాట్ నిర్వహించిన ఆయన, ఈ కేసులో ఎలాంటి రాజకీయ జోక్యం లేదని, చట్టం ప్రకారం చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
* పరారీలో బండి సంజయ్ కుమారుడు…
బండి సంజయ్ కుమారుడిపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయని, పోక్సో చట్టం కింద కేసు నమోదైనప్పుడు తక్షణమే అరెస్ట్ చేయాల్సి ఉంటుందని మహేష్ గౌడ్ పేర్కొన్నారు. “బండి సంజయ్ కుమారుడు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు సమాచారం ఉంది. చట్టం ముందు అందరూ సమానులే. ఆయనను తప్పించాల్సిన అవసరం కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. చట్ట ప్రకారం నడుచుకోకపోతే ఎవరైనా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే” అని ఆయన హెచ్చరించారు. ఈ విషయంలో పోలీసులు ఎక్కడా జాప్యం చేయడం లేదని ఆయన స్పష్టం చేశారు.
* నికార్సైన కాంగ్రెస్ నేత..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై వస్తున్న విమర్శలను మహేష్ గౌడ్ తిప్పికొట్టారు. “రేవంత్ రెడ్డి నికార్సైన కాంగ్రెస్ లీడర్. ఆయన మా కాంగ్రెస్ ముఖ్యమంత్రి. పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగానే పాలన సాగుతోంది” అని పేర్కొన్నారు.
* కేంద్రంపై విమర్శల బాణాలు…
ప్రధాని మోదీ పర్యటనపై స్పందిస్తూ.. “మేము మోదీని కేవలం ప్రధాన మంత్రిగా మాత్రమే గౌరవిస్తాం. గతంలో ప్రధాని మన్మోహన్ సింగ్ అందరినీ కలుపుకుని పోయే వారు, కానీ మోదీ తీరు వేరు. తెలంగాణకు మోదీ ఏదో ఇస్తారని ఆశించాం కానీ ఏమీ ఇవ్వలేదు” అని అసంతృప్తి వ్యక్తం చేశారు.
* బీజేపీ ఎంపీలకు సోయి లేదు
రాష్ట్రం నుండి గెలిచిన బీజేపీ ఎంపీలపై మహేష్ గౌడ్ నిప్పులు చెరిగారు. “రాష్ట్ర బీజేపీ ఎంపీలకు అస్సలు సోయి లేదు. ప్రధాని రాష్ట్రానికి వచ్చినప్పుడు తెలంగాణకు కావాల్సిన హక్కుల గురించి, నిధుల గురించి అడగరా? రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే వారికి ముఖ్యమా?” అని ప్రశ్నించారు. పోక్సో చట్టాన్ని తీసుకువచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని, మహిళలు, బాలల రక్షణ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు.
