Telangana Welfare Schemes Model
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ పట్టణ కేంద్రంలోని ఎస్ కన్వెన్షన్ లో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణి గురువారం జరిగింది. నియోజకవర్గంలోని చిల్పూర్ మండలంలో 22 మంది లబ్ధిదారులకు 9 లక్షల 25 వేలు, స్టేషన్ ఘనపూర్ మండలంలోని 22 మంది లబ్ధిదారులకు 8 లక్షల 10 వేల 500 లు, జఫర్ గడ్ మండలంలోని 22 మంది లబ్ధిదారులకు 5 లక్షల 20 వేల 500లు, రఘునాథపల్లి మండలంలోని 13 మంది లబ్ధిదారులకు 4 లక్షల 34 వేల 500ల చెక్కులను మొత్తంగా 4 మండలాలకు సంబందించిన 79 మంది లబ్ధిదారులకు 26 లక్షల 90 వేల 500 రూపాయల విలువగల చెక్కులను ఎమ్మెల్యే కడియం శ్రీహరి పంపిణి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. రైతుకు అండగా నిలవాలి, వ్యవసాయాన్ని పండుగ చేయాలి అనే ఉద్దేశ్యంతో రైతులకు రుణ మాఫీ, రైతు భరోసా, ఉచిత విద్యుత్, సబ్సిడీపై ఎరువులు, విత్తనాలు, సన్నాలకు బోనస్, కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, ధాన్యంకు మద్దతు ధర అందిస్తున్నట్లు తెలిపారు. రెండోది మహిళా సంక్షేమం. రాష్ట్రంలో మహిళా సాధికారాతకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహ అవసరాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, సన్న బియ్యం పంపిణి, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, ఆర్టీసీ బస్సులు, సోలార్ యూనిట్లు, పెట్రోల్ బంకులు, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయించి కోటి మంది మహిళలను కొటశ్వరులను చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు వెల్లడించారు. మూడోది పేద వర్గాల సంక్షేమం. ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటూనే పేద వర్గాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే పేద ప్రజలు దురదృష్టవశాత్తు కుటుంబ పెద్దను కోల్పోతే వారికి 15 రోజులలో 5 లక్షలు ఆర్థిక సహాయం అందించే విధంగా రాష్ట్రంలోని తెల్ల రేషన్ కార్డు కలిగిన కోటి 10 లక్షల కుటుంబాలకు ఇందిరా కుటుంబ భీమా పథకాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. అలాగే 2 లక్షల కొత్త పెన్షన్లు మంజూరు చేస్తున్నట్లు ఇందులో మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ వితంతు మహిళలకు మొదటగా పెన్షన్ అందించనున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలో అత్యధికంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఎక్కువ నిధులు తీసుకువస్తున్న నియోజకవర్గం స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం అన్నారు. నియోజకవర్గంలో నెలకు సుమారు 150 కుటుంబాలకు సిఎంఆర్ఎఫ్ ద్వారా 50 కుటుంబాలకు ఎల్ఓసిల ద్వారా కోటి రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు వెల్లడించారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స కోసం వైద్య ఖర్చులకు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న పేద వర్గాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని అన్నారు. గ్రామాలలో ప్రజా ప్రతినిధులు వైద్యం చేయించుకునేందుకు ఇబ్బంది పడే పేద ప్రజలకు ఎల్ఓసిల ద్వారా, వైద్యం చేయించుకున్న వారికి సిఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం అందించే ప్రయత్నం చేయాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గతంలో కంటే ఎక్కువగా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ కూడా పేద వర్గాల సంక్షేమ పథకాలను ఆపకుండా అమలు చేస్తుందని తెలిపారు. విద్యా, వైద్య రంగాలకు పెద్ద పీట వేస్తుందని అన్నారు. నియోజకవర్గ కేంద్రంలో నిర్మిస్తున్న 100 పడకల ఆసుపత్రిని డిసెంబర్ 31 లోగ పూర్తి చేసి నియోజకవర్గ ప్రజలకు అంకితం ఇస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ఎక్కడా కూడా అవినీతికి అవకాశం ఇవ్వకుండా ప్రజా ప్రతినిధులు, అధికారులు, నాయకులు అందరం పని చేస్తున్నామని తెలిపారు. దీనిని ప్రజలు గమనించాలని, పారదర్శకంగా పనిచేస్తున్న ప్రజా ప్రభుత్వానికి ప్రజల మద్దతు, ఆశీర్వాదం ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూలుకుంట్ల లావణ్య శిరీష్ రెడ్డి, చిల్పూర్ ఆలయ కమిటీ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు, వైస్ చైర్మన్ నూకల ఐలయ్య, మున్సిపాలిటీ వైస్ చైర్ పర్సన్ నీల రాజమ్మ, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి బలిదే వెంకన్న, డిసిసి కార్యదర్శి ఇల్లందుల బేబీ శ్రీనివాస్ పిఏసీఎస్ చైర్మన్ కరుణాకర్ రావు, కౌన్సిలర్లు సంగీత, లక్ష్మి, స్వరూప, రజిత, సంపత్ రాజు తదితరులు పాల్గొన్నారు.
