Rajaji Kulakalvi Political Controversy
* మద్యాహ్న భోజన పథకం ఇలా పుట్టింది
ఆకేరు న్యూస్, ప్రత్యేక ప్రతినిధి : ప్రజలకోసం ప్రవేశ పెట్టిన ఒక పథకం ముఖ్యమంత్రులను ఆకాశానికెత్తితే.. మరో పథకం అధ: పాతాళానికి తొక్కుతుంది.. రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు..అందులో ఆశ్చర్యమేమి ఉండదు..
ఆ నాడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నందమూరి తారకరామారావు పదవి బాధ్యతలు చేపట్టారు. ఆయన ప్రవేశ పెట్టిన రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం ఎన్టీ రామారావును ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండేట్టు చేసింది. ఆయన మరణాంతరం పత్రికలు అన్న గుండె ఆగింది… పేదవాడి అన్నం గిన్నె తొణికింది.. అంటే పతాక శీర్షికల్లో రాసాయి.. ఆర్థిక భారం ఎంతైనా ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు అనివార్యంగా ఇప్పటికీ ఆ పథకాన్ని కొనసాగించాల్సి వస్తోంది.. అంతగా ఆ పథకం జనంలో ప్రాచుర్యం పొందింది.
* మరీ ముఖ్యమంత్రి పదవి ఎట్లా పోయిందంటే..?
ఆ పథకం తెలుగు రాష్ట్రాలకు సంబందించింది కాదు.. ఆ నేత తెలుగు వాడు కాదు.. మన పొరుగు రాష్ట్రం తమిళనాడుకు చెందిన ఆసక్తికర రాజకీయ పరిణామం. దేశ రాజకీయ నాయకుల్లోనే అత్యంత ప్రముఖుల్లో ఒకరైన సీ. రాజగోపాలచారి ( రాజాజీ ) రాజకీయ ప్రయాణంలో ఎదుర్కొన్న విచిత్ర పరిణామం .
1952లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రాజాజీ, ప్రాథమిక విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలని భావించారు. అప్పట్లో గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలల కొరత, విద్యార్థుల డ్రాపౌట్స్ ఎక్కువగా ఉండేవి. దీంతో నూతన విద్యా విదానాన్ని ప్రతిపాదించారు. అదే కుల కల్వి తట్టం ( Modified System of Elementary Education ) తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో పెనుతుఫాను సృష్టించింది. ఆ పథకం లో భాగంగా పాఠశాలలు రెండు షిఫ్టులుగా పనిచేస్తాయి. విద్యార్థులు ఉదయం పూట 3 గంటలు మాత్రమే పాఠశాలలో చదువుకోవాలి. మిగిలిన సమయంలో విద్యార్థులు తమ తండ్రి , కుటుంబ సభ్యుల నుంచి వారి కుల వృత్తిని లేదా ఇతర పనులను నేర్చుకోవాలి.
గ్రామీణ ప్రాంతాల పిల్లలు కేవలం పుస్తక జ్ఞానానికే పరిమితం కాకుండా, వృత్తి నైపుణ్యాలను కూడా పొందాలని, తద్వారా నిరుద్యోగ సమస్య తగ్గుతుందని రాజాజీ భావించారు.
* రాజకీయ ప్రకంపనలు
ఈ పథకం ప్రకటించగానే తమిళనాడులో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ప్రధానంగా *పెరియార్ ఇ.వి. రామస్వామి, అన్నాదురై (DMK) , కామరాజ్ నేతృత్వంలోని కాంగ్రెస్ లోని ఒక వర్గం దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు.
ఈ పథకం చదువుకునే పిల్లలను తిరిగి వారి కుల వృత్తులకే పరిమితం చేస్తుందని, దీనివల్ల సమాజంలో కుల వ్యవస్థ మరింత బలపడుతుందని విమర్శించారు.
రాజాజీ వర్ణ వ్యవస్థను తిరిగి ప్రవేశపెట్టాలని చూస్తున్నారని, దళిత, వెనుకబడిన వర్గాల పిల్లలు ఉన్నత చదువులకు దూరం కావాలనేది ఆయన వ్యూహమని పెరియార్ విమర్శించారు. దీనినే వారు కుల కల్వి ( Caste-based Education) అని పిలిచారు.ఒక దళితుడు లేదా వెనుకబడిన తరగతికి చెందిన విద్యార్థి జిల్లా కలెక్టర్ కావాలనుకుంటే, ఈ విధానం అతడిని బలవంతంగా తన తండ్రి చేసే వృత్తికే పరిమితం చేస్తుందని వాదించారు .
తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమం ఉదృతమైంది. ‘రాజాజీ హఠావో – కుల కల్వి హఠావో’ అనే నినాదం రాష్ట్రవ్యాప్తంగా మారుమోగింది. కాంగ్రెస్ పార్టీ లోపల కూడా కామరాజ్ వర్గం ఈ పథకం వల్ల పార్టీకి చెడ్డపేరు వస్తుందని వాదించారు. కుల కల్వి తట్టం పథకాన్ని వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్‌లోని కామరాజ్ వర్గం సైతం పట్టుబట్టింది.
* మద్యాహ్న భోజన పథకం ఇలా పుట్టింది..
రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు తీవ్రం అయినాయి. మరో వైపు రాజాజీ పట్ల వ్యతిరేకత తగ్గకపోవడంతో పాటు పార్టీలో మద్దతు కోల్పోవడంతో, 1954లో రాజాజీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.రాజాజీ తర్వాత ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు చేపట్టిన కామరాజ్ అధికారంలోకి రాగానే ఈ పథకాన్ని రద్దు చేశారు.
ఈ వివాదం తర్వాతే తమిళనాడులో ‘బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమం’ మరింత బలపడింది . ద్రవిడ పార్టీలు అధికారంలోకి రావడానికి పునాది పడింది. ముఖ్యమంత్రి కామరాజ్ ఈ పథకాన్ని రద్దు చేయడమే కాకుండా, పిల్లలు బడికి రావడానికి మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టి విద్యా విప్లవానికి తెరలేపారు.
——————
Please tell us what is wrong. Your report will be sent to the website team.
