Temple Theft Accused Arrested
* టెక్నాలజీ తో చెక్
ఆకేరు న్యూస్, వరంగల్: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఆత్మకూర్ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి, ఒక పెద్ద ఆలయ చోరీ కేసును కేవలం 24 గంటల్లోనే ఛేదించారు. ఇద్దరు అంతర్రాష్ట్ర నేరస్తులను అరెస్ట్ చేసి, వారి నుంచి సుమారు రూ. 2 లక్షల 40 వేల విలువైన 1080 గ్రాముల వెండి సామాగ్రితో పాటు చోరీకి ఉపయోగించిన ఒక కారును స్వాధీనం చేసుకున్నారు.
* అర్ధరాత్రి దొంగతనం..
ఈ అరెస్టుకు సంబంధించిన వివరాలను పరకాల ఏసీపీ సతీష్ బాబు మీడియాకు వెల్లడించారు. వారి కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని భీమవరం ప్రాంతానికి చెందిన కల్లకూరి కిరణ్ బాబు, అనంతపురం జిల్లాకు చెందిన సందీప్ కుమార్ అనే ఇద్దరు నిందితులు ఈ నెల 18వ తేదీ అర్ధరాత్రి ఆత్మకూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని గూడెప్పాడు గ్రామంలో గల ఆలయంలోకి చొరబడ్డారు. ఆలయంలోని వెండి సామాగ్రిని దొంగిలించి పరారయ్యారు. మరుసటి రోజు ఉదయం ఆలయ నిర్వాహకులు ఇచ్చిన ఫిర్యాదుపై ఆత్మకూరు పోలీసులు తక్షణమే స్పందించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని (Technology) ఉపయోగించి నిందితుల కదలికలను గుర్తించారు.
* వాహన తనిఖీల్లో దొరికిపోయిన కేటుగాళ్లు…
ఈ రోజు ఉదయం ఆత్మకూరు మండల కేంద్రంలో పోలీసులు ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో అనుమానాస్పదంగా కనిపించిన కారును ఆపి తనిఖీ చేయగా, ఆలయంలో చోరీకి పాల్పడిన అంతర్రాష్ట్ర దొంగలు కిరణ్ బాబు, సందీప్ కుమార్ దొరికిపోయారు. వారి వద్ద ఉన్న వెండి వస్తువులను స్వాధీనం చేసుకుని ఇద్దరినీ అరెస్ట్ చేశారు.
* నిందితుడిపై 50కి పైగా కేసులు…
పోలీసుల విచారణలో ఒక షాకింగ్ నిజం వెలుగుచూసింది. పట్టుబడిన నిందితుల్లో ఒకడైన కిరణ్ బాబు సామాన్యుడు కాదని, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కలిపి ఇప్పటివరకు మొత్తం 50కి పైగా చోరీలకు పాల్పడినట్లుగా పోలీస్ విచారణలో తేలింది.
* పోలీస్ సిబ్బందికి ఏసీపీ అభినందనలు…
ఫిర్యాదు అందిన 24 గంటల వ్యవధిలోనే కేసును ఛేదించి, దొంగలను పట్టుకోవడంతో పాటు చోరీ సొత్తును రికవరీ చేయడంలో ప్రతిభ కనబరిచిన ఆత్మకూర్ ఇన్స్పెక్టర్ సంతోష్‌ను, ఆయన సిబ్బందిని పరకాల ఏసీపీ సతీష్ బాబు ప్రత్యేకంగా అభినందించారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
