Kurchi Thata Passed Away
ఆకేరు న్యూస్, హైదరాబాద్: ఒక్క డైలాగ్‌తో సోషల్ మీడియాను షేక్ చేసి, రాత్రికి రాత్రే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ‘కుర్చీ తాత’ అలియాస్ మహ్మద్ కాలా బాషా (66) ఇక లేరు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, బుధవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్‌లోని కృష్ణకాంత్ పార్క్ వద్ద ఎండతీవ్రతకు గురై ఆయన కుప్పకూలడంతో ఈ విషాదం చోటుచేసుకుంది.
* రోడ్డుపై భిక్షాటన నుండి సెలబ్రిటీ వరకు
వరంగల్ జిల్లా కరీమాబాద్‌కు చెందిన మహ్మద్ పాషా సుమారు 40 ఏళ్ల క్రితమే జీవనోపాధి కోసం హైదరాబాద్‌కు వలస వచ్చారు. ఆయనకు భార్య ఆసియా సుల్తానా, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. అయితే, కుటుంబ పరిస్థితుల కారణంగా ఆయన జీవితం రోడ్డుపైనే సాగింది. బోరబండ ప్రాంతంలో నివసిస్తూ.. యూసుఫ్‌గూడ, కృష్ణకాంత్ పార్క్ పరిసరాల్లో బస్సుల్లో ఇంగ్లీష్ మాట్లాడుకుంటూ భిక్షాటన చేసేవారు. ఈ క్రమంలో ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో తన కుటుంబంలో జరిగిన గొడవ గురించి వివరిస్తూ ఆవేశంలో ఆయన అన్న “ఆ కుర్చీని మడతబెట్టి..” అనే డైలాగ్ సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించింది. మీమర్స్, రీల్స్ క్రియేటర్ల పుణ్యమా అని ఆ డైలాగ్ ఎంతగా వైరల్ అయిందంటే.. రాత్రికి రాత్రే ఆయనను ఒక పెద్ద సెలబ్రిటీని చేసింది. దాంతో అందరూ ఆయనను ప్రేమగా ‘కుర్చీ తాత’ అని పిలవడం ప్రారంభించారు.
* సూపర్ స్టార్ సినిమాలో చోటు
ఈ క్రేజ్ ఎంతవరకు వెళ్లిందంటే, టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్, సంగీత దర్శకుడు థమన్ తమ ‘గుంటూరు కారం’ సినిమాలోని ఒక మాస్ సాంగ్ కోసం ఈ డైలాగ్‌ను రీమిక్స్ చేసి వాడుకున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఎనర్జిటిక్ డ్యాన్స్‌తో ఆ పాట ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోయింది. ఆ సమయంలో చిత్ర యూనిట్ నుంచి ఆయనకు కొంత ఆర్థిక సహాయం కూడా అందింది. డిజిటల్ ప్రపంచంలో వచ్చిన గుర్తింపుతో మరికొందరు సోషల్ మీడియా సెలబ్రిటీలు కూడా ఆయనకు తోచిన సాయం అందించారు.
* ఎండదెబ్బతో విషాదాంతం!
సోషల్ మీడియాలో క్రేజ్ ఎప్పుడూ ఒకేలా ఉండదు. కొన్నాళ్లకు యూట్యూబ్ ఛానళ్లకు కంటెంట్ పాతదైపోవడంతో క్రమంగా అందరూ ఆయనను మర్చిపోయారు. ఇంటర్వ్యూల ద్వారా వచ్చిన డబ్బులు కరిగిపోవడంతో, మహ్మద్ పాషా జీవితం మళ్లీ మొదటికొచ్చింది. దీనికి తోడు అనారోగ్య సమస్యలు, మద్యం అలవాటు ఆయనను మరింత కుంగదీశాయి. గతంలో ఆయన చనిపోయినట్లు కొన్ని పుకార్లు రాగా, తానే స్వయంగా మీడియా ముందుకు వచ్చి ఆ వార్తలను ఖండించారు.
* భార్య ఒడిలోనే తుది శ్వాస
కానీ ఈసారి విధి ఆయనను కరుణించలేదు. మంగళవారం సాయంత్రం కృష్ణకాంత్ పార్క్ వద్ద వాకింగ్ చేస్తుండగా, నగరంలో ముదురుతున్న ఎండల తీవ్రతకు ఆయన ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోయారు. అక్కడ ఉన్నవారు గమనించి సిపిఆర్ (CPR) చేయడానికి ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు ఆయనను ప్రాథమిక చికిత్స అనంతరం ఇంటికి తీసుకెళ్లారు. అయితే, బుధవారం సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురైన పాషా.. తన భార్య ఒడిలోనే కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలు గురువారం జరగనున్నాయి. ‘కుర్చీ తాత’ మరణం పట్ల సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
