Cosmetic Injection Ban India
ఆకేరు న్యూస్, కమలాపూర్:
మీ ముఖం అందంగా మారాలనో, చర్మం తెల్లగా అవ్వాలనో బ్యూటీ క్లినిక్‌లకు వెళ్లి ఇంజెక్షన్లు చేయించుకుంటున్నారా? అయితే ఈ వార్త మీ కోసమే. అందం కోసం ఇంజెక్షన్ల రూపంలో కాస్మెటిక్స్ వాడటాన్ని కేంద్ర ఆరోగ్య సేవల డైరెక్టరేట్ జనరల్ (CDSCO) పూర్తిగా నిషేధించింది. ఈ మేరకు మే 18న కీలకమైన ఆదేశాలను జారీ చేసింది. డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా డాక్టర్ రాజీవ్ సింగ్ రాఘువంశి సంతకం చేసిన ఈ పబ్లిక్ నోటీసు వినియోగదారులు, ప్రొఫెషనల్స్, ఇంపోర్టర్లు, మాన్యుఫాక్చరర్లతో సహా అన్ని స్టేక్హోల్డర్లకు వర్తిస్తుందని పేర్కొంది. ఉల్లంఘనలను ప్రజలు CDSCO వెబ్సైట్ ద్వారా లేదా రాష్ట్ర లైసెన్సింగ్ అథారిటీలకు ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేసింది.
*కాస్మెటిక్స్ అంటే
డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్, 1940 ప్రకారం… శరీరానికి రాయడం, పూయడం, చల్లడం లేదా స్ప్రే చేయడం ద్వారా అందాన్ని పెంచే వాటిని మాత్రమే కాస్మెటిక్స్ అంటారు.ఈ నేపథ్యంలో ప్రజలు, క్లినిక్‌లు, తయారీదారులు పాటించాల్సిన ముఖ్యమైన నిబంధనలు ఇక్కడ ఉన్నాయి.
*అందం కోసం ఇంజెక్షన్లు పూర్తిగా నిషేధం
ఇంజక్షన్ రూపంలో సరఫరా చేయబడే ఉత్పత్తులు అసలు సౌందర్య సాధనాల నిర్వచనం కిందకే రావు. కాబట్టి, వినియోగదారులు కానీ, బ్యూటీ క్లినిక్‌ల నిపుణులు కానీ ఏ కాస్మెటిక్ను కూడా ఇంజెక్షన్‌గా ఉపయోగించడానికి వీల్లేదు.
*చికిత్సలకు వాడకూడదు
సౌందర్య సాధనాలు కేవలం శుభ్రపరచడానికి, అందాన్ని, ఆకర్షణను పెంచడానికి మాత్రమే ఉద్దేశించబడ్డాయి. అంతేకాని, నిపుణులు లేదా ఇతర వ్యక్తులు వీటిని ఎలాంటి వైద్య చికిత్సల కోసం ఉపయోగించడానికి అనుమతి లేదు.
*తప్పుడు ప్రకటనలు నేరం
చర్మం రంగును రాత్రికి రాత్రే మార్చేస్తామనే లాంటి తప్పుడు మభ్యపెట్టే ప్రకటనలను, కాస్మెటిక్ లేబుల్స్‌పై వినియోగదారులను తప్పుదారి పట్టించే ఎలాంటి లేబుల్స్, నమ్మకూడదు. అంతేకాకుండా, తయారీదారు వేసిన లేబుల్ లేదా గుర్తును మార్చడం, చెరిపివేయడం చట్టరీత్యా నేరం.
*నిషేధిత పదార్థాలపై ఆంక్షలు
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) ప్రచురించిన జాబితా ప్రకారం… సాధారణంగా సురక్షితమైనదిగా గుర్తించబడని, ప్రమాదకరమైన (GNRAS) నిషేధిత కెమికల్స్, పదార్థాలను కాస్మెటిక్స్‌లో ఉపయోగించకూడదు.
*ఫిర్యాదు చేయండి
నిబంధనలకు విరుద్ధంగా నిషేధిత పదార్థాలు వాడినా, తప్పుడు ప్రకటనలు చేసినా, లేదా కాస్మెటిక్స్‌ను ఇంజెక్షన్లు/చికిత్సల రూపంలో ప్రయోగించినా అది చట్ట ఉల్లంఘన కిందకే వస్తుంది. ప్రజలు తమ పరిసరాల్లో ఇలాంటివి గమనించినట్లయితే వెంటనే cosmetics@cdsco.nic.in ఈమెయిల్ ఐడీ ద్వారా నియంత్రణ సంస్థకు లేదా రాష్ట్ర లైసెన్సింగ్ అథారిటీకి ఫిర్యాదు చేయవచ్చనీ పబ్లిక్ నోటీసులో పేర్కొంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
