Warangal Police Interstate Theft Operation
ఆకేరు న్యూస్ వరంగల్ : ట్రైసిటీ పరిధిలో వరుస చోరీలు, చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర నేరగాళ్ల ఆటకట్టించేందుకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ సంచలన నిర్ణయం తీసుకుంది. రైలు మార్గాల ద్వారా నగరంలోకి ప్రవేశించి, నేరాలు చేసి అంతే వేగంగా పారిపోతున్న ముఠాలను అడ్డుకునేందుకు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ సరికొత్త యాక్షన్ ప్లాన్‌ను అమలులోకి తెచ్చారు.దేశంలోనే కీలక జంక్షన్లుగా ఉన్న వరంగల్, కాజీపేట రైల్వే స్టేషన్లను కేంద్రంగా చేసుకుని నిరంతర నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు.
* రైలు ఎక్కి వస్తున్నారు.. దోచుకుని పోతున్నారు
పోలీసుల దర్యాప్తులో తేలిన వివరాల ప్రకారం.. ఉత్తర భారతదేశానికి చెందిన వృత్తిపరమైన నేరగాళ్లు వరంగల్, కాజీపేట రైల్వే జంక్షన్ల భౌగోళిక అనుకూలతను ఆసరాగా చేసుకుంటున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి రైళ్ల ద్వారా ఇక్కడికి చేరుకోవడం, తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడటం, మహిళల మెడల్లోంచి గొలుసులు తెంచడం వంటి నేరాలకు పాల్పడుతున్నారు. ఆ తర్వాత స్థానిక పోలీసులకు చిక్కకుండా అదే రైలు మార్గాల ద్వారా తమ స్వస్థలాలకు చెక్కేస్తున్నారు. ఈ సవాల్‌ను స్వీకరించిన కమిషనరేట్ పోలీసులు వీరికి రైల్వే స్టేషన్లలోనే చెక్ పెట్టాలని నిర్ణయించారు.
* రంగంలోకి స్పెషల్ టీమ్స్
రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా అంతర్రాష్ట్ర దొంగలను రైల్వే స్టేషన్లలోనే గుర్తించేందుకు ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేస్తున్నారు.క్రైమ్స్ అదనపు డిసిపి బాలస్వామి, సిసిఎస్ ఏసిపి సదయ్యల ప్రత్యక్ష పర్యవేక్షణలో 4 ప్రత్యేక బృందాలు ఏర్పాటయ్యాయి. వరంగల్ రైల్వే స్టేషన్లో రెండు బృందాలు, కాజీపేట రైల్వే స్టేషన్లో రెండు బృందాలు రంగంలోకి దిగాయి.
గవర్నమెంట్ రైల్వే పోలీస్ (GRP), రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) అధికారులతో కలిసి సమన్వయంతో పనిచేస్తున్నాయి.నలుగురు సభ్యులు ఉండే ఈ టీమ్స్ 24 గంటల పాటు షిఫ్టుల వారీగా నిరంతరం పహారా కాస్తున్నాయి.
* డేటాబేస్‌తో అనుసంధానం.. క్షణాల్లో క్రిమినల్స్ అవుట్!
ఉత్తర భారతదేశం వైపు నుండి వచ్చే రైళ్లపై ఈ ప్రత్యేక బృందాలు ప్రత్యేక నిఘా ఉంచాయి. స్టేషన్లలో దిగే ప్రయాణికుల్లో అనుమానాస్పదంగా కనిపించే వారిని ఆపి, వారి లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఇందులో భాగంగా పోలీసులు అత్యాధునిక సాంకేతికతను వాడుతున్నారు.
అనుమానితుల వేలిముద్రలు (Biometrics), ముఖ కదలికలను (Face Recognition) సేకరించి, తమ వద్ద ఉన్న డిజిటల్ డివైజ్‌ల ద్వారా దేశవ్యాప్త క్రిమినల్ డేటాబేస్‌తో అనుసంధానిస్తున్నారు.
దీనివల్ల సదరు వ్యక్తి గతంలో దేశంలో ఎక్కడైనా నేరానికి పాల్పడి ఉంటే, కేవలం క్షణాల వ్యవధిలో అతని పూర్తి హిస్టరీ పోలీసుల స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతుంది. అలా దొరికిన నిందితులను వెంటనే అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. అలాగే, తనిఖీలకు గురైన ప్రతి ఒక్క అనుమానితుడి వివరాలను భవిష్యత్తు నిఘా కోసం రికార్డుల్లో భద్రపరుస్తున్నారు.
* నిరంతర తనిఖీలు.. నగరానికి రక్షణ
ఈ వినూత్న నిఘా వ్యవస్థతో నగరంలో నేరాల రేటు తగ్గుముఖం పడుతుందని, ప్రజల ఆస్తులకు పూర్తి రక్షణ లభిస్తుందని పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 24 గంటల పాటు సాగే ఈ ఆపరేషన్‌తో వరంగల్, కాజీపేట రైల్వే స్టేషన్లలో అనుమానాస్పద మూఠాల కదలికలకు పూర్తిగా బ్రేక్ పడనుంది.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
