Health Minister Damodar Rajanarsimha Telangana Cancer Care Centers
ఆకేరు న్యూస్ హైదరాబాద్ :
రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య రంగాన్ని కార్పొరేట్ ఆస్పత్రులకు బెంచ్‌మార్క్‌గా నిలిచేలా తీర్చిదిద్దుతున్నామని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని రాడిసన్ బ్లూ హోటల్ లో ‘జీ తెలుగు న్యూస్’ చానెల్ నిర్వహించిన ‘హెల్త్ కేర్ ఎక్సలెన్స్ అవార్డ్స్-2026’ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సమాజానికి విశేష సేవలందించిన పలువురు వైద్యులు, ఆస్పత్రి యాజమాన్యాలకు మంత్రి చేతుల మీదుగా అవార్డులను అందజేశారు.
* ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ..
అవార్డులు అందుకున్న వైద్యులకు, యాజమాన్యాలకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ప్రతి అవార్డు వెనుక ఎన్నో ప్రాణాలు కాపాడిన సేవ, అంకితభావం, త్యాగం దాగి ఉన్నాయని, వారంతా మిగిలిన వారికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. డాక్టర్లు, హాస్పిటళ్లు కేవలం లాభాపేక్షతో కాకుండా.. సమాజంలోని అందరికీ వైద్యం అందుబాటులో ఉండేలా మానవీయ కోణంలో పనిచేయాలని పిలుపునిచ్చారు.
* వైద్య రంగం బలోపేతం – మౌలిక సదుపాయాలు
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నాం. ప్రైమరీ లెవెల్ నుంచి టెర్షీయరీ కేర్ వరకూ అన్ని స్థాయిల్లో హాస్పిటళ్లను బలోపేతం చేస్తున్నాం. మౌలిక సదుపాయాలు, మానవ వనరులు, మందులు, డయాగ్నస్టిక్ సేవలు, అధునాతన పరికరాల లభ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాం.
* నియామకాలు- రియల్ టైమ్ పర్యవేక్షణ
వైద్య ఆరోగ్య శాఖలో ఇప్పటికే 13 వేలకు పైగా పోస్టులను భర్తీ చేశాం. మరో 5 వేల పోస్టుల భర్తీ ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది. కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్య సేవలను నిరంతరం పర్యవేక్షిస్తున్నాం.
* క్యాన్సర్ నివారణకు ప్రత్యేక చర్యలు
జీవనశైలి మార్పుల వల్ల మధుమేహం, బీపీ, గుండె, కిడ్నీ, క్యాన్సర్ వంటి నాన్-కమ్యూనికబుల్ వ్యాధులు (NCD) పెరుగుతున్నాయి. వీటిని ఎదుర్కొనేందుకు నివారణ, చికిత్స, పునరావాసం కలిపిన సమగ్ర విధానంతో ముందుకెళ్తున్నాం.రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో NCD క్లినిక్‌లు ఏర్పాటు చేసి లక్షలాది మందికి చికిత్స అందిస్తున్నాం.క్యాన్సర్‌ను ‘నోటిఫైయబుల్ డిసీజ్’గా ప్రకటించి, క్యాన్సర్ రిజిస్ట్రీని ప్రారంభించాం. డేటా ఆధారిత ప్రణాళికతో మెరుగైన చికిత్స అందిస్తున్నాం.
ప్రతి జిల్లాలో డే కేర్ క్యాన్సర్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. ములుగు, ఆదిలాబాద్ వంటి మారుమూల ప్రాంతాల్లోనూ కీమోథెరపీ సేవలను అందుబాటులోకి తెచ్చాం. ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రి ని ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’గా అభివృద్ధి చేస్తున్నాం.
* డయాలసిస్ సేవల విస్తరణ – రూ.220 కోట్ల నిధులు
కిడ్నీ వ్యాధుల భారం పెరుగుతున్న నేపథ్యంలో డయాలసిస్ సేవలను భారీగా విస్తరించాం. ప్రస్తుతం 102 కేంద్రాల్లో 845 పడకలతో సేవలు అందుతున్నాయి. వీటికి అదనంగా మరో 79 డయాలసిస్ కేంద్రాలు, 416 పడకలు, 155 కొత్త డయాలసిస్ యంత్రాలను ఏర్పాటు చేస్తున్నాం. ఆరోగ్య శ్రీద్వారా సుమారు 16,500 మంది ఉచిత డయాలసిస్ పొందుతున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ఏటా రూ.220 కోట్లు ఖర్చు చేస్తోంది. నిమ్స్ (NIMS) ఆస్పత్రిలో ఇప్పటివరకు 2,000 కిడ్నీ ట్రాన్స్ప్లాంట్లు విజయవంతంగా పూర్తి చేయడమే ప్రభుత్వ వైద్యానికి నిదర్శనం.
* మహిళా ఆరోగ్యం – ఉచిత ఐవీఎఫ్ (IVF) కేంద్రాలు
గాంధీ, పెట్లబుర్జ్ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఐవీఎఫ్ (IVF) కేంద్రాలను ఏర్పాటు చేసి నిరుపేదలకు ఉచితంగా విజయవంతమైన సేవలు అందిస్తున్నాం.రాష్ట్రవ్యాప్తంగా 46 లక్షల మంది స్వయం సహాయక సంఘాల (SHG) మహిళలకు ప్రత్యేకంగా ఆరోగ్య స్క్రీనింగ్ నిర్వహిస్తున్నాం.
* గ్లోబల్ మెడికల్ టూరిజం హబ్‌గా హైదరాబాద్
జిల్లా స్థాయిలోనే 80% వైద్య అవసరాలు తీరేలా సెకండరీ హెల్త్‌కేర్ వ్యవస్థను బలోపేతం చేస్తున్నాం. ఇందులో భాగంగా 7 ప్రధాన ప్రభుత్వ ఆస్పత్రులను బలమైన రిఫరల్ ఆస్పత్రులుగా తీర్చిదిద్దుతున్నాం. త్వరలోనే సనత్‌నగర్ TIMS ఆస్పత్రి ప్రారంభం కానుంది. గాంధీ ఆస్పత్రిలో ఆధునిక ఆర్గన్ ట్రాన్స్‌ప్లాంట్ సెంటర్ ప్రారంభించాం. TIMSను కూడా ‘ఆర్గన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’గా అభివృద్ధి చేస్తాం. హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ స్థాయి’గ్లోబల్ మెడికల్ టూరిజం హబ్’ గా తీర్చిదిద్దేందుకు వీలుగా నూతన ‘మెడికల్ టూరిజం పాలసీ’ని తీసుకువచ్చామని మంత్రి దామోదర్ రాజనర్సింహ వెల్లడించారు.
