Future City Telangana Debate
ఆకేరు న్యూస్, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న ‘ఫ్యూచర్ సిటీ’ ప్రాజెక్టుపై రాజకీయం వేడెక్కింది. ఈ ప్రాజెక్టును ఉద్దేశించి బీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను తెలంగాణప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ తీవ్రంగా తప్పుబట్టారు. ఫ్యూచర్ సిటీ అనేది తెలంగాణ ప్రగతికి, ఆత్మగౌరవానికి తలమానికంగా నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు.
* హరీష్‌రావు వ్యాఖ్యలకు ఘాటు కౌంటర్…
ఇటీవల బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్‌రావు మాట్లాడుతూ.. తాము మళ్లీ అధికారంలోకి రాగానే ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టును రద్దు చేస్తామని వ్యాఖ్యానించారు. దీనిపై మహేష్‌కుమార్ గౌడ్ గట్టి కౌంటర్ ఇచ్చారు. “బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదు.. కాబట్టి ఆ ప్రాజెక్టును రద్దు చేసే పరిస్థితి కూడా వారికి రాదు” అని ఎద్దేవా చేశారు. ప్రజలు వారిని తిరస్కరించారని, పగటి కలలు మానాలని హితవు పలికారు.
* ట్రాఫిక్ కష్టాలకు చెక్ అంతర్జాతీయ హంగులతో ఫ్యూచర్ సిటీ…
హైదరాబాద్ లో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పీసీసీ చీఫ్ గుర్తు చేశారు. ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తూ, భవిష్యత్ తరాల అవసరాలకు తగ్గట్టుగా ఈ ప్రాజెక్టును డిజైన్ చేశామన్నారు.
అన్ని రకాల ఆధునిక వసతులు, అంతర్జాతీయ స్థాయి హంగులతో ఫ్యూచర్ సిటీని ప్రణాళిక చేశామని తెలిపారు. ఇది కేవలం ఒక నగరం కాదు, తెలంగాణ ఆర్థిక వ్యవస్థను మార్చే సరికొత్త గ్రోత్ ఇంజిన్ అని పేర్కొన్నారు.
* తెలంగాణపై కేంద్రానిది మొండిచేయి…
తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సరైన సహకారం అందించడం లేదని మహేష్‌కుమార్ గౌడ్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనకు వచ్చి అరకొర నిధులు మాత్రమే ఇచ్చి వెళ్లారని మండిపడ్డారు. విభజన చట్టం హామీలను నెరవేర్చడంలో కానీ, కొత్త రాష్ట్రాన్ని ఆర్థికంగా ఆదుకోవాలనే ఆలోచనలో కానీ కేంద్రానికి అస్సలు చిత్తశుద్ధి లేదని ఆరోపించారు.
* కేబినెట్ విస్తరణపై క్లారిటీ..
ఇదే సమయంలో రాష్ట్ర మంత్రివర్గ (కేబినెట్) విస్తరణపై వస్తున్న ఊహాగానాలకు ఆయన తెరదించారు. కేబినెట్ విస్తరణ అనేది పూర్తిగా ముఖ్యమంత్రి పరిధిలోని అంశమని.. దీనికి, పీసీసీకి ఎలాంటి సంబంధం లేదని మహేష్‌కుమార్ గౌడ్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
