MLA Padi Kaushik Reddy Crop Residue Burning
ఆకేరు న్యూస్ హుజురాబాద్:
రైతులు తమ పొలాల్లో వరి కొయ్యలు, గడ్డి, పంట అవశేషాలను కాల్చవద్దని రైతన్నలకు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. జమ్మికుంట మండలంలోని మడిపల్లి, కమలాపూర్ మండలంలోని మర్రిపల్లిగూడెంలో దగ్ధమైన తాటి ఈత వనాలను, తోటలను, పొలాలను ఆదివారం ఎమ్మెల్యే సందర్శించారు. పొలాల్లో కొయ్యలు కాల్చడం వల్ల మంటలు అదుపుతప్పి పక్కనే ఉన్న పండ్ల తోటలు, తాటి, ఈత వనాలతో పాటు మోటారు విద్యుత్ వైర్లు దగ్ధమవుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జమ్మికుంట మండలం మడిపల్లిలో తాటివనం , కమలాపూర్ మండలంలోని గుండేడు, కన్నూరు, కమలాపూర్ లో తాటి వనాలు, మర్రిపల్లిగూడెంలో తోట దగ్ధమైందని అన్నారు.
ఈ అగ్ని ప్రమాదాల వల్ల తోటలపై ఆధారపడి జీవించే రైతులు, గౌడ సోదరులు, వ్యవసాయ కార్మికుల వరి ధాన్యం, గడ్డి కుప్పలు, మోటర్లు, పైపులు, వైర్లు కాలిపోయి తీవ్రంగా నష్టపోతున్నారని, రైతులకు లక్షల రూపాయల ఆర్థిక నష్టం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. వరి కొయ్యలు కాల్చడం వల్ల భూమిలోని సేంద్రియ పదార్థాలు, ఉపయోగకరమైన సూక్ష్మ జీవులు నశించి నేల సారం దెబ్బతింటుందని, ఇది భవిష్యత్తులో పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఎమ్మెల్యే హెచ్చరించారు. హుజురాబాద్ నియోజకవర్గంలోని రైతులందరూ కూడా పంట పొలాలలోని కొయ్యలను కాల్చవద్దని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.
* బాధిత గౌడ సోదరులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి
జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామంలో ఇటీవల అగ్నిప్రమాదంలో కళ్లముందే జీవనాధారం కాలి బూడిదవడంతో వీధిన పడ్డ గౌడ సోదరులను ప్రభుత్వం మానవతా దృక్పథంతో తక్షణమే ఆదుకోవాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు తగిన నష్టపరిహారం అందించి అండగా నిలవాలని కోరుతూ ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్‌తో ఫోన్లో మాట్లాడి ప్రమాద తీవ్రతను వివరించారు. దీంతో పాటు ఎక్సైజ్ సీఐతో కూడా మాట్లాడి, సంబంధిత శాఖల ద్వారా బాధితులకు త్వరితగతిన ప్రభుత్వ సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
