TGNPDCL 16 MVA Transformer
ఆకేరు న్యూస్, హనుమకొండ:
తెలంగాణ స్టేట్ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TGNPDCL) తన సేవల విస్తరణలో, మౌలిక వసతుల బలోపేతంలో ఒక సరికొత్త చారిత్రాత్మక మైలురాయిని అధిగమించింది. సంస్థ చరిత్రలోనే మొట్టమొదటి సారిగా అత్యంత భారీ సామర్థ్యం కలిగిన 16 ఎంవీఏ (MVA) పవర్ ట్రాన్స్ఫార్మర్ను విజయవంతంగా అందుబాటులోకి తీసుకువచ్చింది. హనుమకొండ సర్కిల్, హన్మకొండ టౌన్ డివిజన్ పరిధిలోని కీలకమైన కేయూ (కాకతీయ యూనివర్సిటీ) సబ్‌స్టేషన్‌లో రూ.3 కోట్ల భారీ వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ హై-కెపాసిటీ పవర్ ట్రాన్స్ఫార్మర్ను టీజీఎన్పీడీసీఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) శ్రీ కర్నాటి వరుణ్ రెడ్డి, ఐఏఎస్ సోమవారం ఘనంగా ప్రారంభించారు. వేసви కాలంలో రోజురోజుకూ రికార్డు స్థాయిలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను తట్టుకుంటూ, వినియోగదారులకు ఎలాంటి అంతరాయాలు లేని నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయడమే లక్ష్యంగా ఈ వినూత్న అడుగు వేసినట్లు సీఎండీ స్పష్టం చేశారు.
* సాంకేతిక పరిష్కారం…
సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి మాట్లాడుతూ.. హనుమకొండ నగర పరిధిలో జనాభా, వాణిజ్య అవసరాలు పెరగడంతో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరుగుతోందని అన్నారు. అయితే, టౌన్ పరిధిలో కొత్త సబ్స్టేషన్ల నిర్మాణం చేపట్టడానికి అవసరమైన స్థలాలు దొరకడం పెద్ద సమస్యగా మారిందని, ఈ స్థల కొరతను అధిగమించడానికి క్షేత్రస్థాయిలో సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం ఉన్న సబ్‌స్టేషన్లలోనే అత్యాధునిక సాంకేతికతతో కూడిన పవర్ ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యాన్ని (Upgradation) పెంచుకుంటూ వెళ్తున్నామని, ఇందులో భాగమే ఈ 16 ఎంవీఏ పవర్ ట్రాన్స్ఫార్మర్ స్థాపన అని ఆయన వివరించారు.
మరింత ఆధునిక మౌలిక వసతుల కల్పనలో భాగంగా నగరాలు, పట్టణాల పరిధిలో స్థల ఆదా కొరకు ఇండోర్ సబ్స్టేషన్ల (Indoor Substations) ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తున్నామని ఆయన తెలిపారు. సంస్థ పరిధిలోని పలు జిల్లాల్లో ఇప్పటికే ఇండోర్ సబ్స్టేషన్ల నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన వేగవంతం చేసినట్లు సీఎండీ వెల్లడించారు. భవిష్యత్ అవసరాలను ముందే ఊహించి, దానికి అనుగుణంగా అధిక సామర్థ్యంతో కూడిన గ్రిడ్ వ్యవస్థను బలోపేతం చేయడమే సంస్థ ముందస్తు ప్రణాళిక అని పేర్కొన్నారు.
* మెరుగైన వోల్టేజ్ 4 ప్రధాన ఫీడర్లకు మహర్దశ…
ఈ నూతన 16 ఎంవీఏ పవర్ ట్రాన్స్ఫార్మర్ అందుబాటులోకి రావడం వల్ల హనుమకొండ నగరంలోని పలు కీలకమైన మరియు అత్యధిక లోడ్ కలిగిన ప్రాంతాలకు నాణ్యమైన, తక్కువ వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ లేని నిరంతర విద్యుత్ సరఫరా అందనుంది. ముఖ్యంగా సబ్‌స్టేషన్ పరిధిలోని 4 ప్రధాన ఫీడర్లపై లోడ్ ఒత్తిడి తగ్గి, విద్యుత్ సరఫరా వ్యవస్థ మరింత స్థిరంగా మారుతుందని అధికారులు వెల్లడించారు.
* లబ్ధి పొందనున్న ఫీడర్లు…
కొత్తూర్ ఫీడర్ (61 ఆంప్స్): ఈ ఫీడర్ పరిధిలో లోడ్ ఒత్తిడి తగ్గి, నిరంతర సరఫరా అందుతుంది.
ఈద్గా ఫీడర్ (110 ఆంప్స్): ఓవర్ లోడ్ వల్ల వచ్చే ట్రిప్పింగ్ సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి.
నయీంనగర్ ఫీడర్ (120 ఆంప్స్): అధిక వినియోగం ఉన్న ఈ ప్రాంతంలో వోల్టేజ్ స్థిరత్వం పెరుగుతుంది.
సరస్వతినగర్ ఫీడర్ (76 ఆంప్స్): సాంకేతిక అంతరాయాలు లేని కరెంట్ సరఫరా సాధ్యమవుతుంది.
* వినియోగదారుల సేవల్లో రాజీ పడేదే లేదు..
వినియోగదారులకు అంతరాయం లేని కరెంట్ అందించడమే టీజీఎన్పీడీసీఎల్ ప్రధాన సంకల్పమని సీఎండీ పునరుద్ఘాటించారు. మారుతున్న కాలానికి, పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా విద్యుత్ పంపిణీ వ్యవస్థను ఆధునీకరిస్తున్నామని, రాబోయే రోజుల్లో కస్టమర్ కేర్ సేవలను, క్షేత్రస్థాయి సాంకేతిక సేవలను మరింత వేగవంతం చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
* కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు..
ఈ చారిత్రాత్మక ప్రారంభోత్సవ కార్యక్రమంలో టీజీఎన్పీడీసీఎల్ డైరెక్టర్లు వి. మోహన్ రావు, టి. మధుసూదన్, హన్మకొండ సర్కిల్ సూపెరింటెండింగ్ ఇంజనీర్ (SE) బి. సామ్య నాయక్, హన్మకొండ టౌన్ డివిజనల్ ఇంజనీర్ (DE) సాంబ రెడ్డి, డిఈ (MRT) విజయేందర్ రెడ్డి, దర్శన్ కుమార్, అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ (ADE) రాజు, సర్వేశ్ కుమార్, మరియు స్థానిక అసిస్టెంట్ ఇంజనీర్లు (AEs), సాంకేతిక సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
