Lightning Strike Kills Cow
* కమలాపూర్ మండలం ఉప్పులపల్లెలో ఘటన
ఆకేరు న్యూస్, కమలాపూర్:
కమలాపూర్ మండలంలోని ఉప్పులపల్లె గ్రామంలో గురువారం సాయంత్రం కురిసిన వర్షానికి ఘోర ప్రమాదం జరిగింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతున్న సమయంలో ఇంటి వద్ద చెట్టు కింద కట్టేసి ఉన్న, స్థానిక రైతు గుండెకారి ఐలయ్యకు చెందిన జెర్సీ ఆవుపై పిడుగు పడింది. ఈ ప్రమాద తీవ్రతకు ఆ మూగజీవి అక్కడికక్కడే ప్రాణాలు విడిచిందని, ఈ విషయమై పశువైద్యాధికారికి సమాచారం అందించినట్లు గ్రామ సర్పంచ్ ర్యాకం శ్రీనివాస్ తెలిపారు.
సూడి ఆవు కళ్లముందే మృతి చెందడంతో బాధితుడి కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. చనిపోయిన ఆవు విలువ సుమారు ₹60,000 వరకు ఉంటుందని తమ కుటుంబానికి ప్రధాన జీవనాధారమైన పశువు చనిపోవడంతో సర్వస్వం కోల్పోయామని, ప్రభుత్వం తక్షణమే స్పందించి తగిన నష్టపరిహారం అందించి ఆదుకోవాలని బాధిత రైతు ఐలయ్య వేడుకుంటున్నారు.
