Minister Seethakka Father’s Day
* ఫాదర్స్ డే సందర్భంగా తండ్రిని సన్మానించిన మంత్రి సీతక్క.
ఆకేరు న్యూస్, ములుగు:
ఫాదర్స్ డే పురస్కరించుకుని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క స్వగ్రామం ములుగు మండలం జగ్గన్నపేటలో తన తండ్రి దనసరి సమ్మయ్యను కలిసి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తండ్రికి శాలువా కప్పి ఘనంగా సత్కరించి, ఆయన పాదాలకు నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క భావోద్వేగంగా మాట్లాడుతూ, తన జీవితంలో తండ్రి సమ్మయ్య పాత్ర ఎంతో గొప్పదని అన్నారు. చదువు లేని సాధారణ రైతు అయినప్పటికీ, క్రమశిక్షణ, కష్టపడే తత్వం, విలువలను చిన్ననాటి నుంచే నేర్పించారని గుర్తుచేశారు. చిన్నతనంలో బడికి వెళ్లే సమయంలో తనను క్రమశిక్షణతో తీర్చిదిద్దేందుకు తండ్రి చూపిన కఠినత్వమే నేడు ఈ స్థాయికి చేరుకోవడానికి కారణమైందని పేర్కొన్నారు.
తల్లిదండ్రుల ప్రేమ, ఆశీస్సులు జీవితానికి గొప్ప బలమని, ప్రతి ఒక్కరూ తమ తల్లిదండ్రులను గౌరవించి వారి సేవలను గుర్తుంచుకోవాలని మంత్రి సీతక్క సూచించారు. అనంతరం తల్లిదండ్రులు దనసరి సమ్మయ్య, సమ్మక్కలతో కలిసి కొంతసేపు ఆప్యాయంగా గడిపి కుటుంబ సభ్యులతో ముచ్చటించారు.
ఈ కార్యక్రమం కుటుంబ సభ్యుల సమక్షంలో ఆత్మీయంగా జరిగింది. తల్లిదండ్రుల పట్ల మంత్రి సీతక్క చూపిన గౌరవం గ్రామస్థులను ఆకట్టుకుంది.
