115 Year Old Mansion
* భళా.. ఈ బంగళా..
ఆకేరు న్యూస్ , ప్రత్యేక ప్రతినిధి :
ఇప్పటిలా బలమైన కాంక్రీట్ నిర్మాణం కాదు.. మట్టికి పేడ, గుర్రపు లద్ది, బంక మిక్స్ చేసి కట్టిన బంగళా. దాని వయస్సు 115 ఏళ్లు. అయినా ఇప్పటికీ కాంక్రీట్ నిర్మాణం కంటే బలంగా ఉంది. అందుకే.. మరో 100 ఏళ్లయినా ధీమాగా ఉండొచ్చని ఇంజనీరింగ్ నిపుణులు భరోసా ఇస్తున్నారు.
అక్కడ గోడలపై ఉన్నవి ఆయిల్ పెయింటింగ్స్ కాదు.. ఆధునిక కాలంలో ప్రాచుర్యం పొందిన అక్రిలిక్ పెయింట్స్ కూడా కాదు. వార్నిషూ వాడలేదు. ఇవేమీ లేకుండానే అప్పట్లో ఆకుపసర్లతోనే అద్భుత చిత్రాలను ఆవిష్కరించారు. అదీ 100 ఏళ్లయినా చెక్కు చెదరకుండా ఉండేలా. చరిత్రను తెలిపే ఆ బొమ్మలను చూస్తే ఔరా.. అంటూ చేయితిరిగిన చిత్రకారులు ఆశ్చర్యపోతున్నారు.
అలాగని అదేదో రాజుల నిర్మాణం కాదు.. చరిత్రకారులు సృష్టించలేదు. ఓ వ్యాపారి సామ్రాజ్యం. వ్యాపారం నిమిత్తం మహారాష్ట్ర నుంచి తెలంగాణకు వచ్చిన ఓ వంశానికి చెందిన భవనం. ఆ భవన విశేషాలు.. ఆ వంశ చరిత్రపై ఆకేరు న్యూస్ ప్రత్యేక కథనం..!
ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం హంగడి తాంసి అనే ప్రాంతంలోకి వెళ్లగానే ఓ హెరిటేజ్ భవనం అందరినీ ఆకర్షిస్తుంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంగా ఏర్పడకముందు తాంసే ప్రధాన వాణిజ్య కేంద్రంగా ఉండేది. వాణిజ్యానికి పెట్టింది పేరు. చుట్టుపక్కల 60 గ్రామాల నుంచి ఇక్కడికి వ్యాపారం కోసం వచ్చే వాళ్ళు. అలాగే మహారాష్ట్ర నుంచి జర్నలిస్ట్ రాజేష్ పూర్వికులు వ్యాపారం కోసం ఇక్కడకు వచ్చి స్థిరపడ్డారు. వాళ్ళలో మూడవ తరమైన రాజేశ్వర్, వాళ్ళ తండ్రి పడిగల గంగారం ఇక్కడికి వచ్చి స్థిరపడి ఎకరం విశాలమైన ప్రాంగణంలో 1910వ సంవత్సరంలో ఆ బంగళా కట్టారు.
* నిర్మాణమే ఓ ప్రత్యేకం
ఈ భవన నిర్మాణానికి వాడిన మెటీరియల్ గురించి తెలుసుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. మట్టికి పేడ, గుర్రపు లద్ది, బంక… అవన్నీ కలిపి మిక్స్ చేసి గానుగాడించేవాళ్లట. ఆ గానుగాడించి 15 నుంచి 20 రోజులు నాపేసిన (నానబెట్టిన) తర్వాత అది కాంక్రీట్ కంటే గట్టిదనంగా మారుతుంది. అలా తయారు చేసిన మెటీరియల్ తోనే విశాలమైన భవనం నిర్మించారు. అలా ఏకంగా 23 రూములతో ఈ భవన నిర్మాణం ఆకట్టుకునే రీతిలో రూపుదిద్దుకుంది.
* స్టోరేజీ కోసమే 20 రూములు
ఎకరం స్థలంలో నిర్మించిన ఈ భవనంలోని కింద పోర్షన్ లో మాత్రమే నివాసం ఉండేవారు. మిగతా 20 గదులన్నీ స్టోరేజ్ కోసమే ఉపయోగించేవారట. వ్యాపారానికి చెందిన సామగ్రిని ఆయా రూముల్లో భద్రపరిచేవారట. అప్పుడు వాళ్ళకు 1500 ఎకరాల భూమి ఉండేదట. ఆయా భూముల్లో పండే పంటలను కూడా ఆయా రూముల్లో స్టోర్ చేసేవారు.
* ఒక భవనం.. ఐదు తరాలు..
దాదాపు ఐదు తరాలుగా ఆ బంగళాలో నివాసం ఉంటున్నారు. అది తమ యాన్సిస్టర్ (Ancestor) ప్రాపర్టీ అని ప్రస్తుత వారసుడు జర్నలిస్టు రాజేష్ తెలిపారు. “ఇది మా తాతల, ముత్తాతల నుంచి వచ్చింది. 1910 లో వ్యాపారం కోసం మా పూర్వీకులు మహారాష్ట్ర నుంచి ఇక్కడకు వచ్చారు. తాత, వాళ్ళ ముత్తాత వాళ్ళు, ఇప్పుడు మేము ఈ ఇంట్లో ఉంటున్నాం. మేం ఐదవ జనరేషన్ వాళ్ళం. వాళ్ళ కంటే ఒక మూడు జనరేషన్ల ముందు వాళ్ళు అక్కడి నుంచి ఇటు వచ్చింరు.” అని రాజేష్ వివరించారు.
* ఆకుపసర్ల రంగులు.. అద్భుత చిత్రాలు
ఈ భవనంలో మరో ప్రత్యేకం అక్కడి చిత్రాలు. అవన్నీ వందేళ్ల క్రితం వేసినవి. ఇప్పటికీ చెక్కుచెదరకుండా స్పష్టంగా, కళాత్మకంగా ఉన్నాయి. ఆ రోజుల్లో రాజస్థాన్ నుంచి వచ్చిన కళాకారులు ఈ పెయింటింగ్స్ వేసారట.
ఆసక్తికర విషయం ఏంటంటే.. అవన్నీ నాచురల్ కలర్స్ తో వేసినవి. అంటే ఆకు పసర్లతో వేసిన కలర్స్ అన్నట్టు. మెయింటెనెన్స్ లోపం వల్ల కొద్దిగా కళ తప్పాయి కానీ.. కలర్ ఏమాత్రం షేడ్ కాకపోవడం గమనార్హం. మహా భారతం ఘట్టాలను, పాచికల ఆట, గోపికా కృష్ణులు సేదతీరే వైనాన్ని, ఆట,పాటలను, ఆ రాజుల నాటి వైభవాన్ని, కర్ణుడి కోసం సూర్యున్ని ప్రార్థిస్తున్న కుంతీ, తొమ్మిది మంది కన్యలతోని ఏనుగు చిత్రం అద్భుతంగా తీర్చిదిద్దారు. అక్కడి ఓ చిత్రాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే ఇందులో తొమ్మిది మంది కన్యలు ఉండడం గమనార్హం.
* అప్పుడు తెలవక మేం కలర్లు వేసేసుకున్నాం..
“అలాంటి అద్భుత చిత్రాలు భవనంలోని లివింగ్ రూమ్ మొత్తం ఉండేవి. వాటి ప్రాధాన్యత మాకు అప్పుడు తెలవక కలర్లు వేసేసుకున్నాం. పెళ్లిళ్లు అంటే మనం ఇల్లుకి రంగులు, సున్నాలు వేసుకోవడమే కదా. దసరా దసరాకు కంపల్సరీ ఇల్లు మొత్తం రంగులు వేసేది. ఆ క్రమంలో నాన్న వాళ్ళు ఆ రంగులు వేసేశారు.” అని రాజేష్ వివరించారు.
* చారిత్రక ఆనవాళ్లు..
అద్భుత చిత్రాలతో పాటు ఆ భవనంలో ఇప్పటికీ చారిత్రక ఆనవాళ్లు కనిపిస్తాయి. 1960 ల నాటి కరెంటు స్విచ్ బోర్డులు, కరెంటు లేనప్పుడు ఉపయోగించిన పెట్రోమాక్స్ లైట్లు, భవన నిర్మాణ సమయంలో డంగు కోసం ఉన్న శిల అట్లానే ఉన్నాయి. “మనకు అప్పుడు 1958 వరకు కరెంట్ లేదు.. మండలి ఎదరుగా 58 లో కరెంటు వచ్చింది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ ఆదిలాబాద్ కి. కొన్ని వస్తువులు కాలక్రమంలో చోరీకి గురయ్యాయి”.. అని రాజేష్ పేర్కొన్నారు.
* పాట పడినందుకు 25 ఎకరాలు నజరానా.. అలా 1500 ఎకరాలూ..
బంగళాతో పాటు వీరి వంశ చరిత్ర కూడా ఘనంగానే ఉంది. అప్పట్లో తాంస అనేది ప్రధాన వాణిజ్య కేంద్రంగా ఉండేది. చుట్టుపక్కల 60 గ్రామాల నుంచి వ్యాపారులతో పాటు కళాకారులు ఇక్కడకు వచ్చేవాళ్ళు. ఈ బంగళాలోకి వచ్చి కళలు ప్రదర్శించే వాళ్లు.
“సింధు యక్షగానం కళాకారులు, పగటి వేషగార్లు వాళ్ళందరూ వచ్చేవారు. ఇంటి ముందు ఉన్న వాకెట్లో వాళ్ళు ప్రదర్శన ఇస్తే వాళ్ళకు ఆ చేతికి ఏది దొరికితే అది ఇచ్చేయాలి. అది బంగారం గానీ, డబ్బులు గానీ, ఇంకే వస్తువు గానీ. వస్తువుకు, బంగారానికి, డబ్బుకు విలువ లేకుండా ఒక పేరుకు మాత్రమే మా తాత గారు విలువ ఇచ్చేవారు. అట్లా ఉన్న 1500 ఎకరాల భూములంతా హారతి కర్పూరంలో ఆవిరైపోయినాయి. వీళ్ళు వ్యాపారంలో సంపాదించిన డబ్బుతోనే ఆ భూములను కొనుక్కున్నారు. ఆ విధంగా వాళ్ళు ఇక్కడ తాంసీ గ్రామంలో ఒక 500 ఎకరాలు, మిగతా చుట్టుపక్కల ఒక 700, 800 ఎకరాలు సంపాదించారు. అంతా దానం చేసేశారు. ఒక ఊర్లో ఒకాయన తంబూర వాయించేవాడు. ప్రతి శనివారం ఆయన పాటలు పాడుతూ డబ్బు తీసుకునేవాడు. ఆ క్రమంలో తాత దగ్గరికి వచ్చి పాట రాస్తే ఆయనకొక 20 ఎకరాల భూమి ఇచ్చేశారు. ఇలా తాత, ముత్తాతలు సంపాదనంతా చారిటీకే ఎక్కువ ఇచ్చేశారు. ఇప్పటికీ ఈ ఊర్లో ఏ పండుగ జరిగినా, ప్రోగ్రాం జరిగినా ఇక్కడి నుంచి ఆశించే వాళ్ళు ఉన్నారు. ” అని ప్రస్తుత వారసుడు రాజేష్ చెప్పుకొచ్చారు.
* నాలుగో తరం నుంచి ఉద్యోగాల మీదే ఆధారం
ఆ బంగళాకు చెందిన వారసుల్లో రాజేష్ వాళ్ల నాన్న వాళ్ళు ఏడుగురు అన్నదమ్ములు. వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యేసరికల్లా ఆస్తి అంతా కర్పూరం అయిపోయింది. వాళ్ళకు వేరే మార్గం లేక చదువు, ఉద్యోగాల మీద దృష్టి సారించారు. ఆ ఏడుగురూ అప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలే సంపాదించారు. వేరే వేరే వృత్తులలో స్థిరపడిపోవడం వల్ల వాళ్ళు ఎప్పుడు కూడా ఈ ఆస్తి మీద గాని, ఈ బంగళా వైభవం మీద గాని దృష్టి సారించలేదు. ఐదో తరానికి చెందిన రాజేష్ జర్నలిస్టుగా కొనసాగుతున్నారు.
* బంగళా మరో 50 ఏళ్లు.. వందేళ్లు అయినా..
115 సంవత్సరాల క్రితం కట్టిన ఈ బంగళాను ప్రస్తుత వారసుడు రాజేష్ ఇద్దరు, ముగ్గురు ఇంజనీర్లని, పురావస్తు వాళ్లకు చూపించారట. రెనోవేషన్ చేసే క్రమంలో భవనం పటిష్టతను వాళ్ల పరిశీలించి ఇంకా కాపాడుకుంటే 100 సంవత్సరాలు ఉంటదని, ఏం లేకపోయినా 50 సంవత్సరాలు అయితే ఈ భవనానికి ఎటువంటి ప్రమాదమూ లేదని చెప్పారు.
* ఇది హెరిటేజ్ సంపద.. కాపాడుకుంటాం.. ఏటా రూ.2 లక్షలు వెచ్చిస్తున్నాం..
తాత ముత్తాలు సంపాదించిన ఎకరాలు ఎట్లాగూ కరిగిపోయాయి.. ఇప్పుడు ఈ బిల్డింగ్ దాదాపు ఎకరం, ఎకరంన్నర అంటున్నారు కదా… బంగళా కూల్చేసి భూమి అమ్ముతారా అని రాజేష్‌ను ఆకేరు న్యూస్ ప్రతినిధి అడిగితే.. “లేదు లేదండి, ఇది మా తాత ముత్తాతలు మాకు ఇచ్చిన హెరిటేజ్ సంపద. గత వైభవానికి ఇది నిదర్శనంగా నిలుస్తుంది. ఇక్కడ టేకు కర్రతో చెక్కిన కళాఖండాలు ఉన్నాయి. 100 సంవత్సరాల క్రితం ఆకుపసర్లతో వేసిన పెయింటింగ్స్ ఉన్నాయి. వీటన్నిటినీ వారసత్వ సంపదగా మా తర్వాత తరాలకు తెలియజెప్పడానికి ఏటా లక్ష రూపాయల నుంచి రెండు లక్షల రూపాయలు ఖర్చు చేస్తూ కాపాడుతూ వస్తున్నాం. అలాగే కాడుకుంటాం” అని చారిత్రక భవనంపై తన అభిమానాన్ని చాటారు.
