Sand Lorry Traffic Ambulance Death
ఆకేరు న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం: డ్రైవర్ల బాధ్యతారాహిత్యం, రహదారిపై ఇసుక లారీల అరాచకం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. కనీసం అత్యవసర సర్వీస్ అయిన అంబులెన్స్‌కు కూడా దారి ఇవ్వకుండా లారీలను అడ్డంగా నిలపడంతో, సకాలంలో వైద్యం అందక ఒక యువకుడు ప్రాణాలు కోల్పోయిన విషాదకర ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది.
మణుగూరు మండలం దమ్మక్కపేట గ్రామానికి చెందిన వంశీ (35) అనే యువకుడు ప్రమాదవశాత్తు పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనతో అతడిని ఆసుపత్రికి తరలించేందుకు వెంటనే అంబులెన్స్‌ను ఆశ్రయించారు. అయితే, అదే సమయంలో మణుగూరు మండలం సాంబాయిగూడెం నుండి రామానుజవరం వరకు ఉన్న ప్రధాన రహదారిపై ఇసుక లారీలు భారీగా నిలిచిపోయాయి.
రోడ్డుకు ఇరువైపులా లారీలను అడ్డదిడ్డంగా, బాధ్యతారాహిత్యంగా నిలపడంతో తీవ్రమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వంశీని తీసుకువెళ్తున్న అంబులెన్స్‌కు కనీసం వెళ్లేందుకు కూడా వీలు లేకుండా లారీ డ్రైవర్లు రోడ్డును పూర్తిగా బ్లాక్ చేశారు. సైరన్ మోగుతున్నా, ఎంత బ్రతిమాలినా లారీలను పక్కకు తీసే పరిస్థితి లేకపోవడంతో సమయం మించిపోసాగింది.
* భుజాలపై మోసుకెళ్లినా దక్కని ప్రాణం..
రోడ్డు క్లియర్ అయ్యే పరిస్థితి కనిపించకపోవడంతో, క్షణక్షణం క్షీణిస్తున్న వంశీ ప్రాణాలను కాపాడుకునేందుకు కుటుంబ సభ్యులు సాహసం చేశారు. అంబులెన్స్ నుండి వంశీని కిందకు దించి, తమ భుజాలపై వేసుకుని ట్రాఫిక్ దాటించే ప్రయత్నం చేశారు. అలా భుజాలపై మోసుకుంటూ అతికష్టం మీద ఆసుపత్రికి తరలించారు.
అయితే, అప్పటికే జరగరాని నష్టం జరిగిపోయింది. పరీక్షించిన వైద్యులు వంశీ అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించారు. “మరో అరగంట ముందు ఆసుపత్రికి తీసుకొచ్చి ఉంటే వంశీ బతికేవాడు” అని వైద్యులు తెలపడంతో కుటుంబ సభ్యుల ఆవేదన అంతా ఇంతా కాదు.
* బంధువుల ఆగ్రహం…
ఇసుక లారీలను రోడ్డుపై అడ్డంగా నిలపడం వల్లే తమ మనిషి ప్రాణం పోయిందని వంశీ కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా రహదారులను బ్లాక్ చేస్తున్న లారీ యజమానులు, డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి పునరావృతం కాకుండా అధికారులు వెంటనే స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు.
