NEET Exam Entry Denied
* నిమిషం ఆలస్యం.. జీవితం శూన్యం
ఆకేరు న్యూస్, డెస్క్: ఒకవైపు దేశవ్యాప్తంగా నీట్ (NEET) పరీక్ష చుట్టూ వివాదాలు నడుస్తుండగా, తాజాగా జరిగిన రీ-నీట్ (Re-NEET) పరీక్షలో ఒక హృదయవిదారక సంఘటన వెలుగుచూసింది. ఎన్నో ఏళ్లుగా రాత్రింబవళ్లు కష్టపడి, ఎలాగైనా డాక్టర్ కావాలనే లక్యం పెట్టుకున్న విద్యార్థినుల కలలు నిమిషాల వ్యవధిలో చెదిరిపోయాయి. నిబంధనల కఠినత్వం, సాంకేతిక లోపాలు ఆ కన్నబిడ్డల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేశాయి.
* కూతురి కోసం కిందపడి విలపించిన తండ్రి…
మధ్యప్రదేశ్లోని విదిశా నగరంలోని ఒక పరీక్షా కేంద్రం వద్ద చోటుచేసుకున్న దృశ్యాలు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి కళ్ళు చెమర్చేలా చేశాయి. పరీక్షా కేంద్రానికి కొద్దిపాటి ఆలస్యంగా చేరుకున్న ఒక విద్యార్థినిని లోపలికి అనుమతించడానికి అధికారులు నిరాకరించారు. దాంతో ఆ విద్యార్థిని తండ్రి నిస్సహాయ స్థితిలో, గుండె పగిలేలా ఏడుస్తూ అధికారుల కాళ్ళపై పడ్డాడు. “నా కూతురి జీవితాన్ని నాశనం చేయకండి.. లోపలికి పంపించండి” అంటూ నేలపై పడి బోరున విలపించాడు. అయినా నిబంధనల పేరుతో అధికారులు గేట్లు తీయకపోవడంతో ఆ తండ్రీకూతుళ్ల ఆర్తనాదాలు అరణ్యరోదనగానే మిగిలిపోయాయి.
* ముగ్గురు విద్యార్థినులు..
విదిశాలోని గర్ల్స్ కాలేజ్ పరీక్షా కేంద్రం వద్ద ముగ్గురు విద్యార్థినులు రీ-నీట్ పరీక్ష రాయలేకపోయారు. వారిలో స్నేహా దూబే, రాగిణి విశ్వకర్మ అనే ఇద్దరు విద్యార్థినులు కేవలం ‘రెండు నిమిషాల’ ఆలస్యంగా కేంద్రానికి చేరుకున్నారు. రాగిణి అనే విద్యార్థిని దాదాపు 70 కిలోమీటర్ల దూరం నుండి ప్రయాణమై వస్తుండగా మధ్యలో బైక్ పంచర్ కావడం, వర్షం వల్ల రహదారిపై నీరు నిలిచిపోవడంతో కొద్దిగా ఆలస్యమైంది. తాము ఎంతో దూరం నుండి ఇన్ని ఇబ్బందులు పడి వచ్చామని మొరపెట్టుకున్నా గేట్లు తెరుచుకోలేదు.
మరోవైపు, మూడో విద్యార్థిని బయోమెట్రిక్ సమస్య మరియు అడ్మిట్ కార్డులోని చిన్న పొరపాటు (పాత అడ్మిట్ కార్డ్ తీసుకురావడం) కారణంగా పరీక్షా హాల్ లోకి వెళ్ళలేకపోయింది. టెక్నికల్ సమస్యల వల్ల తాము పరీక్ష రాయలేకపోవడంపై ఆ విద్యార్థినులు కన్నీరుమున్నీరవుతున్నారు.
* కరగని నిబంధనల గోడ…
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) గైడ్లైన్స్ ప్రకారం మధ్యాహ్నం 1:30 గంటలకు గేట్లు మూసివేయాలి. అధికారులు నిమిషం కూడా ఆలస్యాన్ని అంగీకరించబోమని స్పష్టం చేయడంతో ఎంతో భవిష్యత్తు ఉన్న విద్యార్థినులు పరీక్షకు దూరమయ్యారు.
“రెండేళ్ల మా కష్టం, మా తల్లిదండ్రుల ఆశలు ఈ రోజుతో బూడిదలో పోసిన పన్నీరయ్యాయి. ఒక చిన్న సాంకేతిక లోపం, ప్రకృతి సృష్టించిన ఆలస్యం మా జీవితాలను దెబ్బతీశాయి” అంటూ ఆ విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిబంధనలు పాటించాల్సిందే కానీ, మానవత్వం కూడా ముఖ్యం కదా అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
