SIR Voter List Revision
* బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలి – మీనాక్షి నటరాజన్
* ఓటు హక్కుపై దాడిని కాంగ్రెస్ తిప్పికొడుతుంది..
– వరంగల్ పశ్చిమ నియోజకవర్గ BLA అవగాహన,శిక్షణ సదస్సులో టీపీసీసీ చీఫ్,ఏఐసీసీ ఇంచార్జ్
అకేరు న్యూస్ డెస్క్ : హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ, వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఆధ్వర్యంలో హంటర్ రోడ్డులోని డీ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) అవగాహన సదస్సు, ఓటర్ల జాబితా సవరణపై బూత్ లెవల్ ఏజెంట్ల (బీఎల్ఏ) శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ హాజరయ్యారు.
వీరికి వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యుడు నాయిని రాజేందర్ రెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు.
టీపీసీసీ అధ్యక్షుడు పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన బీఎల్ఏల శిక్షణ సదస్సులో నేతలు పాల్గొని దిశానిర్దేశం చేశారు.
* పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ..
వరంగల్ నగరంతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని పేర్కొన్న టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, దేశంలో ప్రజాస్వామ్య విలువలు ప్రమాదంలో ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్ఐఆర్ పేరుతో అర్హులైన ఓటర్లను జాబితాల నుంచి తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.
గతంలో ఎన్నోసార్లు ఎస్ఐఆర్ ప్రక్రియలు జరిగినప్పటికీ, ప్రస్తుతం అమలు చేస్తున్న విధానం భిన్నంగా ఉందని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కుకు మించిన హక్కు మరొకటి లేదని, దానిని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కనుసన్నల్లో ఎన్నికల సంఘం పనిచేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్కు అనుకూలంగా భావిస్తున్న ముస్లింలు, ఎస్సీలు, ఎస్టీలు, గిరిజన వర్గాల ఓట్లను లక్ష్యంగా చేసుకుని తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.
పలు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ఓటర్ల జాబితా సవరణల కారణంగా ప్రతిపక్షాలకు నష్టం జరిగిందని పేర్కొన్న ఆయన, ప్రజా ఆగ్రహానికి గురైనప్పుడు ఎంతటి నాయకులైనా ఓటమిని తప్పించుకోలేరని హెచ్చరించారు.
* ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్..
వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో జరుగుతున్న బీఎల్ఏ-2 ఎస్ఐఆర్ ప్రక్రియను అత్యంత అప్రమత్తంగా నిర్వహించాలని ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ సూచించారు.
ప్రతి అర్హత కలిగిన ఓటరు పేరు జాబితాలో కొనసాగేందుకు కాంగ్రెస్ పార్టీ బీఎల్ఏలు క్షేత్రస్థాయిలో సమగ్రంగా పనిచేయాలని కోరారు. ముఖ్యంగా పేద ప్రజలు ఈ ప్రక్రియలో మోసపోయే ప్రమాదం ఉన్నందున వారి ఓటు హక్కును కాపాడాల్సిన బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తలపై ఉందన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఎస్ఐఆర్ ప్రక్రియను ఉపయోగించి బీజేపీకి అనుకూలమైన ఓట్లను నిలుపుకొని, ఇతర వర్గాల ఓట్లను తొలగించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఇప్పటివరకు ఎస్ఐఆర్ అమలైన రాష్ట్రాల్లో భారీ స్థాయిలో ఓటర్ల పేర్లు తొలగించబడ్డాయని పేర్కొన్నారు.
ఎస్ఐఆర్ విషయంలో ఏమరపాటుగా ఉంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించిన ఆమె, ఎన్నికలు సమీపించిన తర్వాత ఓటు నమోదు చేసుకుంటామని నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు.
“మన ప్రభుత్వం ఉంది కాబట్టి అన్నీ సవ్యంగా జరుగుతాయని భావించడం పొరపాటు. ప్రతి కాంగ్రెస్ బీఎల్ఏ, ప్రతి కార్యకర్త ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు అవగాహన కల్పించాలి. అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు హక్కును కాపాడాలి” అని ఆమె పిలుపునిచ్చారు.
తన రాజ్యసభ స్థానానికి సంబంధించిన అంశాన్ని ప్రస్తావిస్తూ, “మొదట ఓట్లను చోరీ చేశారు. తర్వాత నా రాజ్యసభ సీటును చోరీ చేశారు. అవసరమైతే రాజకీయ పార్టీలను కూడా చోరీ చేసే పరిస్థితులు సృష్టిస్తున్నారు” అని విమర్శించారు.
బీజేపీకి రాజకీయ, ప్రజాస్వామ్య నైతిక విలువలు లేవని ఆరోపించిన ఆమె, ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచి రాజకీయ లబ్ధి పొందేందుకు కుట్రలు జరుగుతున్నాయని మండిపడ్డారు.
ఈ సమావేశంలో BLA సదస్సు ఇంచార్జ్,ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి,వర్ధన్నపేట ఎమ్మెల్యే KR నాగరాజు,వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య,రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ లు రియాజ్,కుసురు పాషా,డీసీసీ అధ్యక్షులు వెంకట్రామ్ రెడ్డి,అయూబ్,టీపీసీసీ ఉపాధ్యక్షులు,ప్రధాన కార్యదర్శి లు దుద్దిళ్ల శ్రీనివాస్,నామిండ్ల శ్రీనివాస్ బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి,EV శ్రీనివాస్ రావు,పార్టీ ప్రజాప్రతినిధులు, జిల్లా నాయకులు, బ్లాక్ కాంగ్రెస్ కమిటీ ప్రతినిధులు, బూత్ స్థాయి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
