CM Revanth Reddy Karnataka Visit
ఆకేరు న్యూస్, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గురువారం ఉదయం హైదరాబాద్ నుంచి కర్ణాటకకు బయలుదేరి వెళ్లారు. తుంగభద్ర జలాశయ ఆధునీకరణ పనుల్లో భాగంగా హోస్పేట్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన 33 స్పిల్వే క్రెస్ట్ గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన ఈ పర్యటన చేపట్టారు.
సీఎం రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎక్సైజ్ మరియు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు ప్రభుత్వ ఉన్నతాధికారుల బృందం కూడా కర్ణాటకకు పయనమైంది. తుంగభద్ర బోర్డు పరిధిలోని ఈ కీలక ప్రాజెక్టు గేట్ల పునరుద్ధరణ పనులు పూర్తికావడంతో, ఉమ్మడి రాష్ట్రాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నారు.
* మునిరాబాద్లో భారీ బహిరంగ సభ..
తుంగభద్ర డ్యామ్ వద్ద నూతన గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమం ముగిసిన అనంతరం, సీఎం రేవంత్ రెడ్డి మరియు కర్ణాటకకు చెందిన ప్రముఖ నేతలు మునిరాబాద్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానానికి చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించనున్నారు. ఉమ్మడి నీటి అవసరాలు, అంతర్రాష్ట్ర సంబంధాలు మరియు ప్రాజెక్టుల నిర్వహణపై ఈ సభలో కీలక చర్చ జరిగే అవకాశం ఉంది.
* మధ్యాహ్నమే తిరుగుపయనం..
కర్ణాటకలో అధికారిక కార్యక్రమాలు, బహిరంగ సభ ముగిసిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం తిరిగి హైదరాబాద్కు ప్రయాణం కానుంది. షెడ్యూల్ ప్రకారం గురువారం సాయంత్రం 3:00 గంటల కల్లా సీఎం రేవంత్ రెడ్డి తిరిగి రాజధానికి చేరుకోనున్నారు.
తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దు నీటి పంపకాలు, జలాశయాల భద్రత పరంగా ఈ పర్యటన ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
