Rayaparthy Government Schools Infrastructure Issues
* కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు: రాయపర్తి MEO శ్రీనివాస్
* క్షేత్రస్థాయిలో అసంపూర్తి నిర్మాణాలు.. రక్షణగోడలు లేని పాఠశాలలు
* విద్యార్థుల భద్రత, కనీస అవసరాలపై తక్షణమే స్పందించాలంటున్న తల్లిదండ్రులు
ఆకేరు న్యూస్ రాయపర్తి :
ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘బడి బాట’ కార్యక్రమంతో మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని రాయపర్తి మండల విద్యాశాఖాధికారి (MEO) శ్రీనివాస్ స్పష్టం చేశారు. మండల కేంద్రంలోని తన కార్యాలయంలో ఆకేరు న్యూస్ తో ప్రభుత్వ పాఠశాలలపై పలు విషయాలు ఆయన మాటల్లోనే. గతంలో ప్రభుత్వ బడులంటే వెనుకడుగు వేసే పరిస్థితి ఉండేదని, కానీ నేడు అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల బోధన, ప్రాథమిక స్థాయి నుంచే ఇంగ్లీష్ మీడియం అందుబాటులోకి రావడం వల్ల అడ్మిషన్ల రేటు భారీగా పెరిగిందన్నారు.
అడ్మిషన్ పొందిన ప్రతి విద్యార్థికి ప్రభుత్వం ఉచితంగా యూనిఫాం డ్రెస్సులు, పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, స్కూల్ బ్యాగ్‌లతో కూడిన ప్రత్యేక కిట్లను అందిస్తోందని తెలిపారు. ప్రతి పాఠశాలకు తాగునీరు, ఫ్యాన్లు, లైట్లతో విద్యుత్ సౌకర్యం కల్పించామని, నైపుణ్యాభివృద్ధిలో భాగంగా కంప్యూటర్ విద్య, ‘స్పోకెన్ ఇంగ్లీష్’ ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లోనే చేర్పించాలని కోరారు.
* క్షేత్రస్థాయి సమస్యలు
ఒకవైపు అడ్మిషన్లు పెరుగుతున్నా, మండలంలోని పలు పాఠశాలల్లో కనీస మౌలిక వసతుల కొరత, అసంపూర్తి నిర్మాణాలు విద్యార్థులను వేధిస్తున్నాయి. మండలంలోని ప్రధాన పాఠశాలల దుస్థితి ఇలా ఉంది:
* శిథిలావస్థలో తరగతి గదులు:
తెట్టెకుంట తండా పాఠశాలలో రెండు తరగతి గదులు పూర్తిగా శిథిలావస్థకు చేరడంతో కొత్తవి నిర్మించాల్సిన అవసరం ఉంది. మైలారం ప్రభుత్వ పాఠశాలలో సరిపోయినన్ని రూములు లేవు, ఉన్నవి కూడా నిర్మాణ దశలోనే నిలిచిపోయాయి.
రక్షణ లేని పాఠశాలలు (ప్రహరీ గోడల కొరత): దుబ్బ తండా, జయరాం తండా, సన్నూరు, కొత్తతండా (జె), గటికల్లు పాఠశాలలకు అసలు ప్రహరీ గోడలే లేవు. ఇక జడ్పీహెచ్ఎస్ ఊకల్లు పాఠశాలలో ప్రహరీ గోడ, గేటు నిర్మాణం అసంపూర్తిగా మిగిలిపోయింది.
మరుగుదొడ్ల దుస్థితి – బాలికల ఇబ్బందులు: కాట్రపల్లి స్కూల్లో మరుగుదొడ్ల నిర్మాణం మధ్యలోనే ఆగింది. మైలారంలో అసలు టాయిలెట్సే లేవు. జడ్పీహెచ్ఎస్ ఊకల్లులో బాలుర మరుగుదొడ్లు స్లాబ్ వరకే కట్టి వదిలేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఇక్కడి బాలికల టాయిలెట్స్ పైకప్పులు పూర్తిగా దెబ్బతిన్నాయి.
ల్యాబ్‌లు, లైబ్రరీలకు గదులు కరువే: జడ్పీహెచ్ఎస్ రాయపర్తి పాఠశాలలో విద్యార్థులకు ఎంతో కీలకమైన లైబ్రరీ, సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్‌లకు ప్రత్యేక గదులు లేవు. ఇక్కడ మీటింగ్ స్టేజ్, డైనింగ్ హాల్ నిర్మాణాలు కూడా అసంపూర్తిగా ఉన్నాయి. దుబ్బ తండాలో అంగన్వాడీ పిల్లలు చదువుకోవడానికి కనీసం తరగతి గది కూడా లేదు.
* తక్షణమే నిధులు విడుదల చేయాలి
ప్రభుత్వం విద్యా రంగానికి భారీ నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటిస్తున్నా.. రాయపర్తి మండలంలోని ఈ అసంపూర్తి పనులు, వసతుల కొరతపై విద్యాశాఖ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని స్థానికులు కోరుతున్నారు. విద్యార్థుల సంఖ్య పెరుగుతున్న తరుణంలో, అందుకు తగ్గట్టుగా మౌలిక వసతులను కల్పిస్తేనే ప్రభుత్వ బడులు నిజమైన కార్పొరేట్ స్థాయికి చేరుకుంటాయని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
