Warangal Government Schools Closure
ఆకేరు న్యూస్, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రభుత్వ విద్యా రంగం పరిస్థితి నానాటికీ ఆందోళనకరంగా మారుతోంది. ప్రైవేట్ పాఠశాలల మోజులో పడిపోవడం, పర్యవేక్షణా లోపం, మౌలిక వసతుల కొరత వెరసి సర్కారు బడులు వెలవెలబోతున్నాయి. తాజాగా విద్యార్థుల సంఖ్య గణనీయంగా పడిపోవడంతో వరంగల్, హనుమకొండ జిల్లాల పరిధిలో ఏకంగా 167 ప్రభుత్వ పాఠశాలలు ఈ విద్యా సంవత్సరం (2026-27) శాశ్వతంగా మూతపడే పరిస్థితికి చేరుకున్నాయి.
* మూతపడుతున్న పాఠశాలలు..
విద్యాశాఖ గణాంకాల ప్రకారం, వరంగల్ జిల్లాలో అత్యధికంగా 131 పాఠశాలలు, హనుమకొండ జిల్లాలో 36 పాఠశాలలు విద్యార్థులు లేక తాళాలు వేసే స్థితికి వచ్చాయి. నెక్కొండ మండలం లోనే అత్యంత దారుణంగా ఈ ఒక్క మండలంలోనే అత్యధికంగా 28 పాఠశాలలు మూతపడుతున్నాయి.
చెన్నారావుపేట, రాయపర్తి ఈ రెండు మండలాల్లో చెరో 16 పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా నమోదు కాకపోవడం గమనార్హం.
* తల్లిదండ్రుల్లో వ్యక్తమవుతున్న ఆందోళన..
గ్రామీణ ప్రాంతాల్లోని పేద, మధ్యతరగతి విద్యార్థులకు దిక్కుగా ఉన్న ప్రభుత్వ బడులు ఇలా ఒకదాని తర్వాత ఒకటి మూతపడటంపై స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. “బడి ఈడు” పిల్లలు ఉన్నప్పటికీ ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం సడలిపోవడం, ఆంగ్ల మాధ్యమం (English Medium) వైపు తల్లిదండ్రులు మొగ్గు చూపడం, కొన్ని చోట్ల ఉపాధ్యాయుల కొరత ఉండటమే దీనికి ప్రధాన కారణాలుగా విశ్లేషకులు చెబుతున్నారు.
మొత్తం 167 బడులు మూతపడుతుండటంతో, భవిష్యత్తులో ప్రభుత్వ విద్యా వ్యవస్థ మనుగడ సాగిస్తుందా లేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం, విద్యాశాఖ ప్రత్యేక శ్రద్ధ వహించి, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందిస్తూ, అడ్మిషన్లను పెంచేలా చర్యలు చేపట్టాలని ప్రజా సంఘాలు, విద్యావేత్తలు డిమాండ్ చేస్తున్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
