Maharashtra Wedding Card Birth Date Rule
* మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం….
ఆకేరు న్యూస్, డెస్క్: సమాజంలో ఇంకా కొనసాగుతున్న బాల్య వివాహాలనే మహమ్మారిని పూర్తిగా నిర్మూలించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఒక వినూత్నమైన, సంచలన నిర్ణయానికి శ్రీకారం చుట్టబోతోంది. ఇకపై రాష్ట్రంలో ముద్రించే ప్రతి పెళ్లి పత్రిక (Wedding Invitation Cards) పై వధూవరుల పేర్లతో పాటు, వారి పుట్టిన తేదీని (Date of Birth) కూడా తప్పనిసరిగా ముద్రించాలనే సరికొత్త నిబంధనను తీసుకురావడానికి కసరత్తు చేస్తోంది.
ఈ మేరకు మహారాష్ట్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి అదితి తట్కరే అసెంబ్లీలో ఒక కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో బాల్య వివాహాల నియంత్రణకు గానూ ఈ ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు ఆమె వెల్లడించారు.
* రాజస్థాన్ మోడల్ ఆధారంగా..
దేశంలో ఇప్పటికే రాజస్థాన్ రాష్ట్రంలో ఈ తరహా విధానం అమల్లో ఉంది. అక్కడ పెళ్లి పత్రికలపై వధూవరుల పుట్టిన తేదీలను ముద్రించడం ద్వారా బాల్య వివాహాలను చాలా వరకు అడ్డుకోగలిగారు. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్ర ప్రభుత్వం కూడా రాజస్థాన్ నమూనాను అధ్యయనం చేస్తోందని మంత్రి తెలిపారు. పెళ్లి పత్రికపై పుట్టిన తేదీ ఉండటం వల్ల స్థానిక అధికారులు, గ్రామీణ కమిటీలు లేదా సాధారణ పౌరులైనా వధూవరుల వయస్సును సులభంగా నిర్ధారించుకోవడానికి వీలవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
* రూల్ బ్రేక్ చేస్తే కఠిన చర్యలు…
ఈ ప్రతిపాదనపై గ్రామీణాభివృద్ధి, న్యాయ శాఖలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు మంత్రి అదితి తట్కరే స్పష్టం చేశారు. దీనిపై త్వరలోనే అసెంబ్లీలో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఒకవేళ ఈ నిబంధన చట్టరూపం దాలిస్తే.. కేవలం పెళ్లి చేసుకునే కుటుంబాలపైనే కాకుండా, నిబంధనలు ఉల్లంఘించి తప్పుడు తేదీలతో కార్డులు ముద్రించే ప్రింటింగ్ ప్రెస్‌లు, పెళ్లిళ్లు జరిపించే కళ్యాణ మండపాలు (ఫంక్షన్ హాళ్లు), పురోహితులపై కూడా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
రాబోయే ఐదేళ్లలో రాష్ట్రంలో బాల్య వివాహాల రేటును 10 శాతం కంటే తక్కువకు తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ వినూత్న అస్త్రాన్ని సిద్ధం చేస్తోంది. ఈ సరికొత్త నిబంధనపై త్వరలోనే అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.
