Uppal Accident
* డ్రమ్ పేలి మహిళ మృతి
ఆకేరు న్యూస్, హైదరాబాద్: నగరంలోని ఉప్పల్ పారిశ్రామిక ప్రాంతంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఐడీఏ ఉప్పల్‌లోని హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ పరిశ్రమలో (Heritage Foods Uppal Accident) డ్రమ్ పేలడంతో పింకీ దేవి అనే మహిళా కార్మికురాలు మృతి చెందింది. శనివారం ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.
వివరాల్లోకి వెళ్తే.. బీహార్‌కు చెందిన పింకీ దేవి రామంతాపూర్‌లోని గాంధీనగర్‌లో నివాసం ఉంటూ హెరిటేజ్ ఫుడ్స్ పరిశ్రమలో పనిచేస్తున్నారు. శనివారం విధుల్లో భాగంగా కంపెనీలోని క్రేట్ వాషర్ వద్ద వ్యర్థాలను పారవేసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో ఒక్కసారిగా (Heritage Foods Uppal Accident) డ్రమ్ పేలడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
* కంపెనీ ఎదుట కార్మికులు, కుటుంబ సభ్యుల ఆందోళన
ఈ ప్రమాదం విషయం తెలుసుకున్న మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు, తోటి కార్మికులు, స్థానికులు కంపెనీ ఎదుట ఆందోళనకు దిగారు. పింకీ దేవి మృతికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి తగిన నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. మృతురాలికి ముగ్గురు పిల్లలు ఉన్నట్లు సమాచారం. దీంతో వారి భవిష్యత్తుపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
* పేలుడుకు కారణాలపై విచారణ
డ్రమ్‌లో ఉన్న పదార్థాలేమిటి? పేలుడు ఎలా సంభవించింది? పరిశ్రమలో కార్మికుల భద్రతకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అనే అంశాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. గుర్తుతెలియని వ్యర్థ పదార్థాల కారణంగా పేలుడు జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రమాదానికి గల అసలు కారణాలు విచారణలో తేలాల్సి ఉంది. బాధిత కుటుంబానికి న్యాయం చేయడంతో పాటు పరిశ్రమల్లో కార్మికుల భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

